పేదల జీవితాల్లో వెలుగునింపడానికి ముద్రా బ్యాంక్ దోహదపడుతుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి
కేంద్ర మంత్రి దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ : పేదల జీవితాల్లో వెలుగునింపడానికి ముద్రా బ్యాంక్ దోహదపడుతుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ముద్రా బ్యాంకు ద్వారా దేశంలోని 5.77 లక్షల సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రూ.20 వేల కోట్ల రుణాలు అందనున్నాయన్నారు. తద్వారా 12 కోట్ల నుంచి 25 కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని చెప్పారు. తెలుగులో ప్రచురించిన ముద్రా బ్యాంకు విధి విధానాల పుస్తకాన్ని బుధవారం ఏపీ భవన్‌లో మంత్రి దత్తాత్రేయ, టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ ముద్రా బ్యాంకు విధివిధానాలపై తెలుగులో పుస్తకం తీసుకురావడం ద్వారా ఏపీ, తెలంగాణలోని నిరుద్యోగులు, మహిళా పొదుపు సంఘాలు, చిరువ్యాపారులకు రుణాలు పొందే విషయంలో అవగాహన ఏర్పడుతుందన్నారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ప్రభుత్వ పథకాలకు సార్థకత చేకూరదన్నారు. ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ రాజకీయాలకు అతీతంగా పేద, మధ్యతరగతి, నిరుద్యోగులకు వర్తించేలా పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమానికి పుస్తక రచయిత టి.రామదాసప్పనాయుడు అధ్యక్షత వహించారు.