మైనస్ 208 నుంచి ప్లస్ 135కు | Late rally lifts Sensex 135 pts, Nifty above 7500; Maruti up 4% | Sakshi
Sakshi News home page

మైనస్ 208 నుంచి ప్లస్ 135కు

Mar 10 2016 1:12 AM | Updated on Sep 3 2017 7:21 PM

మైనస్ 208 నుంచి ప్లస్ 135కు

మైనస్ 208 నుంచి ప్లస్ 135కు

ట్రేడింగ్ చివర్లో బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా ఉండటంతో స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లో ముగిసింది.

యూరో అంచనాలతో చివర్లో లాభాలు
7,500 మార్క్‌ను దాటిన నిఫ్టీ
46 పాయింట్ల లాభంతో 7,532కు చేరిక
370 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్
135 పాయింట్ల లాభంతో 24,794 వద్ద ముగింపు

 ముంబై: ట్రేడింగ్ చివర్లో బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా ఉండటంతో స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లో ముగిసింది. దీంతో ఆరు రోజుల స్టాక్ మార్కెట్ లాభాల యాత్ర కొనసాగుతోంది. సెన్సెక్స్ ఐదు వారాల గరిష్ట స్థాయిని చేరగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 7,500 పాయింట్ల మార్క్‌ను దాటేసింది.  సెన్సెక్స్ 135 పాయింట్లు లాభపడి 24,794 పాయింట్ల వద్ద, నిఫ్టీ 46 పాయింట్లు లాభపడి 7,532 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆయిల్, ఇన్‌ఫ్రా, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, కొన్ని వాహన, బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. ఈ ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 1,792 పాయింట్లు లాభపడింది.

 మధ్యాహ్నం వరకూ నష్టాల్లోనే...
మధ్యాహ్నం వరకూ సెన్సెక్స్ నష్టాల్లోనే ట్రేడ్ అయింది. యూరప్ కేంద్ర బ్యాంక్ ప్యాకేజీని ఇస్తుందన్న అంచనాలతో యూరప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్  అన్ని నష్టాలను పూడ్చుకొని లాభాల బాట పట్టింది. ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి సెన్సెక్స్ 200 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 24,821, 24,451 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిలను తాకింది. మంగళవారం నాటి ముగింపుతో చూస్తే సెన్సెక్స్ ఇంట్రాడేలో 208 పాయింట్లు నష్టపోగా, 161 పాయింట్ల లాభాన్ని పొందింది.  మొత్తం మీద సెన్సెక్స్ 370 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.

 మారుతీ జోరు..
కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ విటారా బ్రెజాను మార్కెట్లోకి తెచ్చిన నేపథ్యంలో మారుతీ సుజుకీ షేర్ 4 శాతం లాభపడి రూ.3,600 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడ్డ షేర్ ఇదే. 30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎల్ అండ్ టీ, ఓఎన్‌జీసీ, హిందూస్తాన్ యూనిలివర్, భెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ఇన్పోసిస్ షేర్లు 1-2 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి.  లాభాల స్వీకరణతో లోహ షేర్ల నష్టపోయాయి.  వేదాంతా, హిందాల్కో, జిందాల్ స్టీల్, సెయిల్, హిందుస్తాన్ జింక్‌లు 1.5 శాతం నుంచి 4 శాతం వరకూ నష్టపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement