జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు 4.7 బిలియన్‌ డాలర్ల జరిమానా

Johnson & Johnson ordered to pay $4.7-billion in talc cancer case - Sakshi

టాల్కం పౌడర్‌ వివాదంలో అమెరికా కోర్టు తీర్పు

సెయింట్‌ లూయీ (అమెరికా): బేబీ టాల్కం పౌడర్లో ఆస్‌బెస్టాస్‌ అవశేషాల వివాదంలో దిగ్గజ సంస్థ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కి (జేఅండ్‌జే) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పౌడర్‌ వాడటం వల్ల ఒవేరియన్‌ క్యాన్సర్‌ బారిన పడిన 22 మంది బాధిత మహిళలు, వారి కుటుంబాలకు 4.7 బిలియన్‌ డాలర్ల మేర పరిహారం చెల్లించాలంటూ సెయింట్‌ లూయీ సర్క్యూట్‌ కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా జేఅండ్‌జే తయారు చేసే బేబీ పౌడర్, షవర్‌ టు షవర్‌ ఉత్పత్తుల్లో ప్రధానంగా ప్రమాదకమైన ఆస్‌బెస్టాస్‌ అవశేషాలు ఉన్న సంగతి వాస్తవమేనని వైద్య నిపుణులు వాంగ్మూలం ఇచ్చారు.

పలువురు బాధిత మహిళల అండా శయ కణాల్లో ఆస్‌బెస్టాస్‌ ఫైబర్, టాల్కం పౌడర్‌ రేణువులు కనిపించినట్లు తెలిపారు. అయితే, కోర్టు తీర్పుపై జేఅండ్‌జే అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు తమ ఏ ఉత్పత్తిలోనూ ఆస్‌బెస్టాస్‌ వినియోగం ఉండదని స్పష్టం చేసింది. విచారణంతా పక్షపాత ధోరణితో నడిచిందని, కోర్టు తీర్పుపై అప్పీల్‌ చేస్తామని వివరించింది. మొత్తం మీద 9,000 మంది పైచిలుకు మహిళలు కంపెనీపై దావా వేశారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top