ఆ రెండు టెక్‌ దిగ్గజాల్లో పెరుగుతున్న లేఆఫ్స్‌

Infosys, Wipro laid off 1% of its workforce in last six months

సాక్షి, న్యూఢిల్లీ : టాప్‌ ఐటీ దిగ్గజాలు తమ ఉద్యోగులకు అందిస్తున్న పింక్‌ స్లిప్‌లు మెల్లమెల్లగా కఠినంగా మారుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలోనే టాప్‌-5లో ఉన్న ఇన్ఫోసిస్‌, విప్రో కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను 1 శాతం మేర తగ్గించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యయాలు తగ్గుతుండటంతో, ఇన్ఫోసిస్‌, విప్రోలు తమ వర్క్‌ఫోర్స్‌ను భారీగా తగ్గించేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఈ రెండు కంపెనీలు 3,646 ఇంజనీర్లను తీసేశాయి. ఈ క్రమంలో రెండో క్వార్టర్‌లో విప్రో ఉద్యోగులు 1.82 శాతం, ఇన్ఫోసిస్‌ మరింత మందిని తీసేసినట్టు డెక్కన్‌ హెరాల్డ్‌ రిపోర్టు చేసింది. తొలి ఆరు నెలల కాలంలో ఇన్ఫోసిస్‌1,924 ఉద్యోగులను ఇంటికి పంపించగా.. విప్రో 1,722 మందిని తగ్గించినట్టు ఈ కంపెనీలు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్నాయి. 

ఏప్రిల్‌లో ఈ రెండు కంపెనీల్లో పనిచేసే మొత్తం ఉద్యోగులు 3,65,845 మంది ఉండగా.. సెప్టెంబర్‌ చివరి నాటికి ఈ సంఖ్య 3,62,199కి చేరింది. దీంతో మార్చి క్వార్టర్‌లో ఉన్న ఒక్కో ఉద్యోగి రెవెన్యూ 51,400 డాలర్ల నుంచి సెప్టెంబర్‌ క్వార్టర్‌కు 52,700 డాలర్లకు పెరిగింది. గత కొన్ని నెలల కిందట ఇన్ఫోసిస్‌ నుంచి వైదొలిగిన ఇన్ఫోసిస్‌ మాజీ సీఈవో, ఎండీ విశాల్‌ సిక్కా 2020 నాటికి ఒక్కో ఉద్యోగి రెవెన్యూ 80,000 డాలర్లు ఉండాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దేశంలో ఉద్యోగ కల్పనకు అతిపెద్ద రంగంగా ఉన్న ఐటీ, ప్రస్తుతం ఒత్తిడిలో కొనసాగుతుందని, ఉద్యోగులను చేర్చుకోవాలన్నా కంపెనీలు వెనుకాడుతున్నాయని విశ్లేషకులు చెప్పారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top