బాకీలు వెంటనే కట్టేయండి | Indian telecoms come up with part of payments due | Sakshi
Sakshi News home page

బాకీలు వెంటనే కట్టేయండి

Mar 5 2020 5:50 AM | Updated on Mar 5 2020 5:50 AM

Indian telecoms come up with part of payments due - Sakshi

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏజీఆర్‌ సంబంధ మిగతా బాకీలను కూడా వెంటనే కట్టేయాలంటూ టెల్కోలను కేంద్రం ఆదేశించింది. భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాతో పాటు ఇతర ఆపరేటర్లకు టెలికం శాఖ (డాట్‌) ఈ మేరకు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ’మరింత జాప్యం లేకుండా’ మిగతా బకాయిలు చెల్లించడంతో పాటు స్వీయ మదింపు గణాంకాలు తదితర వివరాలు కూడా సమర్పించాలని డాట్‌ సూచించినట్లు వివరించాయి. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) ఫార్ములాకు అనుగుణంగా డాట్‌ లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల కింద టెల్కోలు దాదాపు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, తమ స్వీయ మదింపు ప్రకారం డాట్‌ చెబుతున్న దానికంటే తాము కట్టాల్సినది చాలా తక్కువే ఉంటుందని టెల్కోలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా రూ. 26,000 కోట్లు మాత్రమే చెల్లించాయి.  
పీఎస్‌యూలకు మినహాయింపు..
ఏజీఆర్‌ బాకీల కేసు నుంచి టెలికంయేతర ప్రభుత్వ రంగ సంస్థలను సుప్రీం కోర్టు తప్పించినట్లు  సమాచార శాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రే పార్లమెంటుకు తెలియజేశారు. తగు వేదికల ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించినట్లు రాతపూర్వక సమాధానంలో ఆయన పేర్కొన్నారు. సొంత అవసరాల కోసం తీసుకున్న స్పెక్ట్రంలో కొంత భాగాన్ని థర్డ్‌ పార్టీలకు ఇవ్వడం ద్వారా ఆదాయం ఆర్జించాయన్న ఉద్దేశంతో గెయిల్‌ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు ఏజీఆర్‌పరంగా రూ. 2.7 లక్షల కోట్లు కట్టాలంటూ డాట్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement