వీసాలు భారీగా తగ్గించేశాయ్‌!

Indian IT Companies Take Less Than 12% Of H-1B Visas - Sakshi

బెంగళూరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎలాంటి చర్యలు తీసుకున్నా... దేశీయ ఐటీ రంగంపై భారీ ఎత్తున్న ప్రభావం పడకుండా ఉండేందుకు దేశీయ కంపెనీలు సర్వం సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఆఫర్‌ చేసే హెచ్‌-1బీ వీసాలను భారీగా తగ్గించేశాయి. ఈ విషయాన్ని నాస్కామ్‌ చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ, అధ్యక్షుడు డెబ్జాణి ఘోష్‌లు ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దేశీయ ఐటీ కంపెనీలు మొత్తం హెచ్‌-1బీ వీసాల్లో 12 శాతం కంటే తక్కువగా తీసుకున్నాయని తెలిపారు. ప్రతేడాది 65 వేల వీసాలు అందుబాటులో ఉంటే, ఈ ఏడాది దేశీయ కంపెనీలు 8500 కంటే తక్కువగా తీసుకున్నాయని చెప్పారు. గత రెండేళ్లలో వీసాలు 43 శాతం మేర కిందకి పడిపోయినట్టు పేర్కొన్నారు. బిజినెస్‌ మోడల్స్‌లో మార్పులు సంభవిస్తున్న తరుణంలో ఇది అతిపెద్ద పరివర్తనగా ఘోష్‌ అభివర్ణించారు. ప్రతి ఒక్క దేశీయ ఐటీ కంపెనీ స్థానికులనే ఎక్కువగా నియమించుకునేందుకు చూస్తుందని ప్రేమ్‌జీ తెలిపారు. క్రమానుగతంగా స్థానికతను పెంచుతున్నట్టు చెప్పారు. 

హెచ్‌-1బీ వీసాలు పొందిన వారిలో ఎక్కువగా టాప్‌ అమెరికా దిగ్గజాలే ఉన్నాయని, వారు భారత్‌ నుంచే ఎక్కువగా నియామకాలు చేపట్టారని చెప్పారు. దీని గల కారణం వారికి ప్రతిభావంతులైన ఉద్యోగులు కావాలని ఘోష్‌ చెప్పారు. హెచ్‌-1బీ వీసాలు ఎక్కువగా భారత్‌కే వస్తున్నాయని, ఈ ఉద్యోగులను ఎక్కువగా అమెరికా కంపెనీలే నియమించుకుంటున్నాయని పునరుద్ఘాటించారు. నేడు ప్రపంచంలో పెద్ద మొత్తంలో నైపుణ్యవంతుల కొరత ఏర్పడిందని, ఈ క్రమంలో ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో తాము నాయకత్వ ప్రొగ్రామ్‌ను లాంచ్‌ చేసినట్టు ప్రేమ్‌జీ పేర్కొన్నారు. ఈ ప్రొగ్రామ్‌ కింద ఐటీలో ఉద్యోగం చేస్తున్న 20 లక్షల మందికి రీస్కిల్‌ ప్రొగ్రామ్‌ చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో కలిసి పచిచేస్తున్నట్టు చెప్పారు. లేఆఫ్స్‌పై స్పందించిన ఘోష్‌, కొత్త ఉద్యోగాలు సృష్టించడానికే నాస్కామ్‌ దృష్టిసారించిందని పేర్కొన్నారు. కొత్త ఉద్యోగాలకు సన్నద్దమయ్యేలా ప్రజలను తయారుచేస్తున్నామన్నారు. రాబోతున్న 9 కొత్త టెక్నాలజీస్‌తో ఎన్ని ఉద్యోగాల కల్పన జరుగనుందని, ఉద్యోగాల సృష్టిపై వాటి ప్రభావం ఎంత, వాటిని ఎలా ఎదుర్కొనాలి అనే అన్ని అంశాలను నాస్కామ్‌ గుర్తించినట్టు చెప్పారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top