అమెరికా దిగుమతులపై భారత్‌ సుంకాలు

India Tariffs on American Imports - Sakshi

29 ఉత్పత్తులపై టారిఫ్‌ల వడ్డన

ఈ నెల 16 నుంచి అమల్లోకి

భారత్‌కు అదనంగా 217 మిలియన్‌ డాలర్ల ఆదాయం  

న్యూఢిల్లీ: భారత్‌ నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం తదితర ఉత్పత్తులపై అమెరికా భారీగా సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ప్రతిగా అమెరికన్‌ దిగుమతులపై కూడా టారిఫ్‌ల వడ్డనకు రంగం సిద్ధమైంది. జూన్‌ 16 నుంచి అమెరికా నుంచి దిగుమతయ్యే 29 ఉత్పత్తులపై అదనంగా కస్టమ్స్‌ సుంకాలు విధించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటిదాకా దీన్ని వాయిదా వేస్తూ వచ్చినప్పటికీ.. తాజాగా అమల్లోకి తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టారిఫ్‌లు విధించబోయే ఉత్పత్తుల్లో బాదం, వాల్‌నట్, పప్పు ధాన్యాలు మొదలైనవి ఉన్నాయి.

ఈ 29 ఉత్పత్తులను ఎగుమతి చేసే అమెరికా సంస్థలకు అదనపు సుంకాల వడ్డన ప్రతికూలం కానుండగా.. భారత్‌కు అదనంగా 217 మిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరనుంది. గతేడాది మార్చిలో భారత్‌ నుంచి దిగుమతయ్యే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10% మేర అమెరికా సుంకాలు విధించింది. దీనికి ప్రతీకారంగా అమెరికన్‌ దిగుమతులపై టారిఫ్‌లు విధించాలని 2018 జూన్‌ 21న ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాగలదన్న ఆశతో వాయిదా వేస్తూ వచ్చింది. అయితే, జీఎస్‌పీ పథకం కింద భారత ఎగుమతిదారులకు ఇస్తున్న మినహాయింపులను ఎత్తివేయాలని అమెరికా నిర్ణయించడంతో చర్చల ప్రక్రియ స్తంభించింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా చర్యలకు ఉపక్రమించింది.  ప్రతిపాదన ప్రకారం.. ఆక్రోట్‌(వాల్‌నట్‌) పై ఇప్పటిదాకా 30 శాతంగా ఉన్న దిగుమతి సుంకాలను 120 శాతానికి, శనగపప్పు మొదలైన వాటిపై 30 శాతం నుంచి 70%కి టారిఫ్‌లు పెంచుతారు. 2017–18లో అమెరికాకు భారత్‌ ఎగుమతుల విలువ 47.9 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండగా, దిగుమతుల విలువ 26.7 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అమెరికాకు భారత్‌ ఏటా 1.5 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top