వాటి ధరలు ఇక షాకే..

India Likely To Raise Import Duties On More Than Fifty Items - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనా సహా పలు దేశాల నుంచి దిగుమతవుతున్న 50 రకాల వస్తువులు, ఉత్పత్తులపై దిగమతి సుంకాలను పెంచేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఎలక్ర్టానిక్స్‌, ఎలక్ర్టికల్‌ పరికరాలు, రసాయనాలు, హ్యాండీక్రాఫ్ట్స్‌ వంటి పలు వస్తువులపై సుంకాల పెంపునకు రంగం సిద్ధమైందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించే వార్షిక బడ్జెట్‌లో ఈ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. దిగుమతులను తగ్గించడం ద్వారా లోటుపోట్లను అధిగమించడంతో పాటు దేశీ ఉత్పత్తులకు గిరాకీ పెంచడం, ఆర్థిక మందగమనాన్ని నివారించే చర్యలనూ ఆమె ప్రకటించనున్నారు. కస్టమ్స్‌ డ్యూటీలను పెంచడం వల్ల మొబైల్‌ ఫోన్‌ చార్జర్లు, పారిశ్రామిక రసాయనాలు, ల్యాంప్‌లు, ఫర్నీచర్‌, క్యాండిల్స్‌, జ్యూవెలరీ, హ్యాండీక్రాఫ్ట్‌ ఐటెమ్స్‌ సహా పలు వస్తువులు, ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది.

ముడి పదార్ధాలను దిగుమతి చేసుకుంటున్న స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులపైనా ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. మరోవైపు భారత్‌లో కస్టమ్స్‌ సుంకాలు అధికంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఐకియా వంటి సంస్ధలూ తాజా నిర్ణయంతో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోనున్నాయి. ఇక ఆహారేతర ఉత్పత్తులు, వస్తువుల దిగుమతులను ప్రోత్సహించరాదనే లక్ష్యంతోనే దిగుమతి సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చైనా సహా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కలిగిన దేశాల నుంచి వెల్లువలా వచ్చి పడుతున్న చౌక ఉత్పత్తుల నుంచి దేశీ తయారీదారులను కాపాడేందుకు దిగుమతి సుంకాల పెంపు దోహదపడుతుందని భావిస్తున్నారు. వర్తక ఒప్పందాల ముసుగులో నాసిరకం దిగుమతులకు బడ్జెట్‌ చెక్‌ పెడుతుందని భావిస్తున్నామని బీజేపీ ఆర్థిక వ్యవహారాల విభాగం చీఫ్‌ గోపాల్‌ కృష్ణన్‌ అగర్వాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

చదవండి : ఆ 63 మంది సంపద మన బడ్జెట్‌ కంటే అధికం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top