హైదరాబాద్‌కు ఐకియా రాక.. ఆలస్యం

IKEA Postpones Opening Of Its First Store In Hyderabad - Sakshi

హైదరాబాద్ ‌: స్వీడన్‌కు చెందిన గృహోపకరణాల తయారీ దిగ్గజ సంస్థ ఐకియా తన తొలి భారతీయ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించబోతుంది. అయితే ఈ స్టోర్‌ ప్రారంభం షెడ్యూల్‌ కంటే 20 రోజులు ఆలస్యం కానుందని తెలిసింది. తొలుత ఈ స్టోర్‌ను ఈ నెల 19న ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. కానీ ఈ స్టోర్‌కు అవసరమైన కొన్ని పనుల్లో జాప్యం జరగడంతో 2018 ఆగస్టు 9కు వాయిదా వేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘‘వినియోగదారులు, కో-వర్కర్ల కోసం అనుకున్న నాణ్యతతో స్టోర్‌ సిద్ధం చేయడానికి మరికొంత సమయం అవసరమవుతుంది. దీంతో ప్రారంభాన్ని వాయిదా వేయాలని ఐకియా ఇండియా నిర్ణయించింది’ అని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ వినియోగదారులకు, కో-వర్కర్లకు సురక్షితమైన అనుభవాన్ని, అత్యుత్తమ సౌకర్యాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఐకియా ఇండియా సీఈవో పీటర్‌ బెట్జల్‌ తెలిపారు. నాణ్యత విషయంలో తమ వాగ్దానాలను నిలబెట్టుకుంటామని, ఐకియా తొలిస్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించనుండటం చాలా సంతోషకరమని బెట్జల్‌ అన్నారు.

వెయ్యి కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లో ఈ స్టోర్‌ ప్రారంభమవుతుంది. దీనిలో వెయ్యి మందికి ప్రత్యక్షంగా, మరో 1,500 మందికి పరోక్షంగా ఉద్యోగాలను కల్పించబోతుంది. ఈ స్టోర్‌లో సగం ఉద్యోగాలను మహిళలకు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఐదేళ్ల క్రితం ఈ స్వీడన్‌ పర్నీచర్‌ దిగ్గజానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. భారత్‌లో తన స్టోర్లను ఏర్పాటు చేయాలనే రూ.10,500 కోట్ల పెట్టుబడుల ప్రణాళికకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2025 కల్లా ఐదు భారతీయ నగరాల్లో 25 స్లోర్లను ప్రారంభించాలని ఐకియా ప్లాన్‌ చేస్తుంది. ఏప్రిల్‌లో స్టోర్లను ఏర్పాటు చేసేందుకు గుజరాత్‌ ప్రభుత్వంతో కంపెనీ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని అంచనావేస్తోంది. అదేవిధంగా కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాలలో కూడా రిటైల్‌ స్టోర్లను ఏర్పాటుచేసేందుకు ఎంఓయూలపై ఐకియా సంతకాలు కూడా పెట్టింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top