
ఫ్యాషన్ దుస్తులు తదితర ఉత్పత్తుల విక్రయ సంస్థ లైఫ్‌స్టయిల్ ఇంటర్నేషనల్ తమ కార్యకలాపాల విస్తరణపై ఏటా రూ. 100–120 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 14 స్టోర్స్ ప్రారంభిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా సుమారు 125 స్టోర్స్ ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో 14 ఉన్నాయి. శుక్రవారమిక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ సీఈవో దేవ్ అయ్యర్ ఈ విషయాలు తెలిపారు.
తమ ఆదాయాల్లో తెలుగు రాష్ట్రాల వాటా 11–12 శాతం ఉంటుందని ఆయన చెప్పారు. జీఎస్‌టీలో మార్పులతో ధరలపరంగా 6–8 శాతం మేర ప్రభావం ఉంటుందని అయ్యర్ చెప్పారు. జీఎస్‌టీ సంస్కరణలతో దేశీయంగా వినియోగానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు, డిజిటల్, కొత్త స్టోర్స్, ప్రైవేట్ బ్రాండ్లు మొదలైన అయిదు అంశాలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం వ్యాపారంలో సుమారు ఆరు శాతంగా ఉన్న డిజిటల్ వాటాను వచ్చే ఏడాది, రెండేళ్లలో 10–12 శాతానికి పెంచుకోనున్నామని అయ్యర్ చెప్పారు.
గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 5,000 కోట్ల ఆదాయం ఆర్జించగా, ఈసారి రెండంకెల స్థాయి వృద్ధి అంచనా వేస్తున్నామన్నారు. ప్రధానంగా మెట్రోల్లో స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఏడాది 10–12 స్టోర్స్ ప్రారంభించనున్నామని అయ్యర్ వివరించారు. పండుగ సీజన్ సందర్భంగా లైఫ్‌స్టయిల్ ఎక్స్‌క్లూజివ్ దసరా కలెక్షన్‌ను సినీ నటి పూజా హెగ్డే ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: మారుతీ కార్ల ధరలు తగ్గాయ్!