
వస్తు, సేవల పన్నుల్లో (జీఎస్‌టీ) మార్పుల నేపథ్యంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తమ వాహనాల రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మోడల్‌ను బట్టి ధర తగ్గింపు రూ.1,29,600 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 22 నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
ద్విచక్ర వాహనాల యూజర్లు .. కార్లకు అప్‌గ్రేడ్ కావడంలో సహాయకరంగా ఉండేలా, జీఎస్‌టీపరంగా 8.5% తగ్గింపునకు అదనంగా, చిన్న కార్ల ధరలను మరింతగా తగ్గించినట్లు సంస్థ వివరించింది. దేశీయంగా కార్ల వినియోగం చాలా తక్కువగా ఉన్నందున మార్కెట్ దిగ్గజం హోదాలో కార్లను మరింత అందుబాటులో స్థాయిలోకి తెచ్చేందుకు తాము చొరవ తీసుకుంటున్నట్లు వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. గత కొన్నాళ్లుగా నెమ్మదిస్తున్న ఎంట్రీ లెవెల్ కార్ల సెగ్మెంట్ పుంజుకోవడానికి ధరల తగ్గింపు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
