ఐకియా స్టోర్‌ వచ్చేసింది.. ఇక పండుగే

IKEA India Formally Inaugurated IKEA Store In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నీచర్‌ దిగ్గజం ఐకియా భారత్‌కు వచ్చేసింది. తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో అధికారికంగా లాంచ్‌ చేసింది. ఐకియా స్టోర్‌ ప్రారంభోత్సవ వేడుకలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. మన సొంత హైదరాబాద్‌, తెలంగాణ ద్వారా మరో ప్రముఖ బ్రాండ్‌ భారత్‌లోకి ప్రవేశించిందని మంత్రి తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు, ఐకియా గ్రూప్‌ సీఈవో జాస్పర్‌ బ్రాడిన్, భారత్‌లో స్వీడన్‌ అంబాసిడర్‌ క్లాస్‌ మోలిన్‌, ఐకియా రిటైల్‌ ఇండియా సీఈవో పీటర్‌ బెజెల్‌లు పాలుపంచుకున్నారు. హైటెక్‌ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు ఎదురుగా రూ.1000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. 

ఒకేసారి వెయ్యి మంది కూర్చునే సామర్థ్యం ఉన్న రెస్టారెంట్‌ను కూడా ఐకియా ఈ స్టోర్‌లో ఏర్పాటు చేసింది. 7,500 రకాల ఫర్నిచర్, ఫర్నిషింగ్, వంటింటి సామగ్రిని ఇక్కడ విక్రయిస్తారు. దాదాపు 1,000 రకాల ఉత్పత్తుల ధర రూ.200 లోపే ఉండటం గమనార్హం. ప్రత్యక్షంగా ఈ స్టోర్‌లో 950 మంది పనిచేస్తున్నారు. ఐకియా పాలసీ ప్రకారం వీరిలో సగం మంది మహిళలున్నారని ఐకియా రిటైల్‌ ఇండియా సీఈవో పీటర్‌ బెజెల్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ స్టోర్‌ ద్వారా పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.  

భారత్‌లో 40 నగరాల్లో.. 
దేశంలో 40 నగరాల్లో ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలన్నది ఐకియా ప్రణాళిక. 2025 నాటికి 25కు పైగా సెంటర్లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో కంపెనీ సుమారు రూ.5,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ముంబై స్టోర్‌ 2019 వేసవిలో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత బెంగళూరు, గురుగ్రామ్‌లో సైతం ఐకియా కేంద్రాలు రానున్నాయి. అహ్మదాబాద్, పుణే, చెన్నై, కోల్‌కతా, సూరత్‌లోనూ ఏర్పాటు చేస్తామని ఐకియా గ్రూప్‌ సీఈవో జాస్పర్‌ బ్రాడిన్‌ తెలిపారు. 20 కోట్ల మంది కస్టమర్లను మూడేళ్లలో చేరుకోవాలన్నది సంస్థ లక్ష్యం.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top