సెప్టెంబర్‌ తర్వాత ఎయిర్‌ ఇండియా అమ్మకం!

 Govt eyes about $1 billion from Air India sale - Sakshi

రూ.7,000 కోట్లు  వస్తుందని అంచనా

న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాలో వాటాల విక్రయం ద్వారా బిలియన్‌ డాలర్లు (రూ.7,000 కోట్లు సుమారు) లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థ భాగంలో ఎయిర్‌ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను చేపట్టనుంది. ఈ లోపు ఎయిర్‌ ఇండియా అనుబంధ కంపెనీలను విక్రయించనుంది. ఈ వివరాలను ఓ అధికారి మీడియాకు తెలిపారు. ఎయిర్‌ ఇండియాకు రూ.55,000 కోట్ల వరకు రుణాలు ఉన్నాయి. ఇందులో రూ.29,000 కోట్ల రుణాలను స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ)కి బదలాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలోని మంత్రివర్గ ప్యానెల్‌ లోగడ నిర్ణయించిన విషయం తెలిసిందే. గతేడాది ఎయిర్‌ఇండియాలో వాటాలను అమ్మకానికి పెట్టినప్పటికీ కొనేందుకు ఎవరూ ముందుకు రాని విషయం గమనార్హం. 76 శాతం వాటాను, యాజమాన్య నియంత్రణను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టాలని కేంద్రం అప్పుడు భావించించింది. ఇది కార్యరూపం దాల్చకపోవడంతో, ప్రత్యామ్నాయ ప్రణాళికలను ముందుకు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా సంస్థ అనుబంధ కంపెనీలు... ఎయిర్‌ ఇండియా ట్రాన్స్‌పోర్ట్‌సర్వీసెస్, ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ను విక్రయించాలని నిర్ణయించింది. అలాగే, భవనాలు, భూములను కూడా విక్రయించడం ద్వారా వచ్చే నిధులు ఎస్‌పీవీకి వెళతాయి. సంస్థ రుణాలను తీర్చివేసేందుకు వీటిని  వినియోగిస్తారు.

ఎకానమీ నుంచి బిజినెన్‌ తరగతి... ఎయిర్‌ ఇండియాలో టికెట్‌ అప్‌గ్రెడేషన్‌  
ప్రయాణికులకు ఎయిర్‌ ఇండియా కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఎకానమీ తరగతి కోసం టికెట్‌ బుక్‌ చేసుకున్న వారు, బిడ్డింగ్‌ విధానంలో బిజినెస్‌ క్లాస్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. ఇందుకు కొంచెం అదనపు చార్జీని చెల్లించాల్సి ఉంటుందని సంస్థ చైర్మన్‌ఖరోలా తెలిపారు. ‘‘ఎకానమీ టికెట్‌కు చెల్లించిన దానికి అదనంగా ఎంత మేర చెల్లించాలనుకుంటున్నారో బిడ్‌ వేయాల్సి ఉంటుంది. కనీస బిడ్‌ మొత్తాన్ని మేం నిర్ణయిస్తాం. గరిష్ట పరిమితీ ఉంటుంది’’ అని ఖరోలా వివరించారు. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, జపాన్, హాంగ్‌కాంగ్‌కు విమాన సర్వీసులపై ఈ సదుపాయం ఉంటుందన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top