కొత్త వ్యాపారాల్లోకి గెయిల్‌!

GAIL seeks to diversify portfolio - Sakshi

స్టార్టప్‌లు, సౌర విద్యుత్‌ తదితర రంగాల్లో పెట్టుబడులు

ఈ మేరకు తమ చార్టర్‌ను సవరించనున్న కంపెనీ

ఈ సవరణకు వాటాదారుల ఆమోదం కోరిన గెయిల్‌  

న్యూఢిల్లీ: గెయిల్‌ కంపెనీ ఇతర వ్యాపారాల్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ గ్యాస్, పెట్రో కెమికల్స్‌ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ వ్యాపారాలు కాకుండా సౌరశక్తి ప్లాంట్ల ఏర్పాటు, ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమైన బ్యాటరీ చార్జింగ్‌ స్టేషన్ల నిర్మాణం, స్టార్టప్‌లలో పెట్టుబడులు, తదితర  రంగాల్లోకి విస్తరించాలని భావిస్తోంది.

ఈ వ్యాపారాల నిర్వహణకు కంపెనీ చార్టర్‌లో సవరణలు చేయాలి. అందుకోసం వాటాదారుల ఆమోదాన్ని గెయిల్‌ కోరింది. కంపెనీ ఎంఓఏలో (మెమొ రాండమ్‌ ఆఫ్‌ అసోసియేషన్‌) ప్రధాన లక్ష్యాల క్లాజులో ఆరు కొత్త సెక్షన్లను చేర్చడానికి ఆమోదం తెలిపాలని వాటాదారులకు పంపిన నోటీసులో గెయిల్‌ కోరింది. వచ్చే నెల 11న కంపెనీ 34వ వార్షిక సాధారణ సమావేశం జరగనుంది.  

స్టార్టప్‌లలో పెట్టుబడి...
తమప్రధాన వ్యాపారాలైన నేచురల్‌ గ్యాస్, పెట్రో కెమికల్స్, ఎనర్జీ సంబంధిత స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. వీటితో పాటు ఆరోగ్య, సామాజిక, పర్యావరణ, రక్షణ, భద్రత సంబంధిత స్టార్టప్‌లలోనూ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ స్టార్టప్‌లలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఇన్వెస్ట్‌ చేస్తామని తెలిపింది. స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌(ఎస్‌పీవీ), ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఏఐఎఫ్‌), ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌(ఎఫ్‌ఓఎఫ్‌), ట్రస్ట్‌ల ద్వారా ఇన్వెస్ట్‌ చేయనున్నామని వివరించింది.

‘‘పర్యావరణ పరిరక్షణలో భాగంగా బ్యాటరీ చార్జింగ్‌ స్టేషన్లను, చార్జింగ్‌ సర్వీసులను ఆరంభించాలనుకుంటున్నాం. సొంత వినియోగానికే కాకుండా, విక్రయానికి కూడా వెసులుబాటుండేలా సౌరశక్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. హైడ్రో కార్బన్‌ పైప్‌లైన్ల రంగంలో ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ), ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌(ఈపీసీఎమ్‌), ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ(పీఎమ్‌సీ)సేవలను అందించ గల సత్తా ఉంది. ఈ మేరకు అవకాశాలను అందిపుచ్చుకోవాలని కూడా చూస్తున్నాం’’ అని కంపెనీ తెలిపింది.

గ్యాస్‌ మీటర్‌లు, సీఎన్‌జీ కిట్‌లు వంటి ఉపకరణాల తయారీ, పంపిణీ, మార్కెటింగ్‌లకు సంబంధించిన వ్యాపారంలో కూడా ప్రవేశించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. గురువారం జీవిత కాల గరిష్టానికి చేరిన నేపథ్యంలో గెయిల్‌ షేర్‌లో శుక్రవారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో ఈ కంపెనీ షేర్‌ బీఎస్‌ఈలో 1.6 శాతం క్షీణించి రూ.387 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top