భారత్‌లో వృద్ధి మాంద్యం..

Extreme Centralisation Of Power In PMO Not Good Says Raghuram Rajan - Sakshi

అధికారాలన్నీ పీఎంవోలోనే కేంద్రీకృతం

దేశానికి ఇది శ్రేయస్కరం కాదు

విమర్శిస్తే రాజకీయ దురుద్దేశాలు అంటగట్టొద్దు

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌

న్యూఢిల్లీ: పాలనాధికారాలన్నీ ప్రధాని కార్యాలయంలోనే కేంద్రీకృతమై ఉన్నాయని, మంత్రులంతా నిమిత్తమాత్రులుగానే ఉంటున్నారని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి పాలనతో ఎకానమీ తీవ్ర రుగ్మతలతో సతమతమవుతోందని .. దేశం ‘వృద్ధి మాంద్యం’ పరిస్థితుల్లో చిక్కుకుందని పేర్కొన్నారు. ఒక వార్తాపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశాన్ని గట్టెక్కించాలంటే పెట్టుబడులు, భూ.. కార్మిక చట్టాలపరమైన సంస్కరణలు మరిన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో పెట్టుబడులతో పాటు వృద్ధికి కూడా ఊతం లభించగలదని రాజన్‌ తెలిపారు.

దేశ సమర్థతను మెరుగుపర్చుకోవడానికి, పోటీ దేశాలకు దీటుగా ఎదగడానికి .. ఉపయుక్తంగా ఉండే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంపై భారత్‌ దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ‘ప్రస్తుత ప్రభుత్వంతో సమస్యేమిటంటే .. అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటాయి. నిర్ణయాలే కాదు.. ఆలోచనలు, ప్రణాళికలు.. అన్నీ కూడా ప్రధాని చుట్టూ ఉండే కొద్ది మంది, ప్రధాని కార్యాలయం నుంచి వస్తుంటాయి. ఒక పార్టీ రాజకీయ, సామాజిక ఎజెండాను అమలు చేయడానికి ఇలాంటి విధానం పనికొస్తుంది కానీ.. ఆర్థిక సంస్కరణల విషయంలో ఇది పనిచేయదు.

ఇందుకు రాష్ట్రాల స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో ఎకానమీ ఎలా పనిచేస్తుందన్న దానిపై అపార పరిజ్ఞానం అవసరమవుతుంది‘ అని రాజన్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సంకీర్ణంగా నడిచినప్పటికీ.. ఆర్థిక విధానాల సరళీకరణను స్థిరంగా ముందుకు తీసుకెళ్లాయన్నారు. ‘తీవ్ర స్థాయిలో అధికార కేంద్రీకరణ, మంత్రులకు అధికారాలు లేకపోవడం తదితర అంశాల కారణంగా.. పీఎంవో దృష్టి పెట్టినప్పుడు మాత్రమే సంస్కరణలు జోరందుకుంటున్నాయి. పీఎంవో దృష్టి మిగతా అంశాలవైపు మళ్లిన మరుక్షణం.. సంస్కరణల జోరూ తగ్గిపోతోంది‘ అని రాజన్‌ అన్నారు.

ముందుగా సమస్యను గుర్తించాలి..
ఆర్థిక మందగమనానికి మందు కనుగొనాలంటే.. ముందుగా సమస్య తీవ్రతను గుర్తించడం దగ్గర్నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుందని రాజన్‌ తెలిపారు. ‘సమస్య పరిమాణాన్ని గుర్తించాలి. సమస్య తాత్కాలికమేనని.. ప్రతికూల వార్తలు, అననుకూల సర్వేలను తొక్కి పెట్టి ఉంచితే అది పరిష్కారమైపోతుందనే ఆలోచనల నుంచి బైటికి రావాలి.

విమర్శించే ప్రతి ఒక్కరికీ రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం మానుకోవాలి. దేశం వృద్ధి మాంద్య పరిస్థితుల మధ్యలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన ఒత్తిడి ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. భారత జీడీపీ వృద్ధి రేటు.. జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్టమైన 4.5%కి పడిపోయిన నేపథ్యంలో రాజన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సంస్కరణలు తేవాలి.. 
రియల్‌ ఎస్టేట్, నిర్మాణ, ఇన్‌ఫ్రా రంగాలు.. వాటికి రుణాలిచ్చిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు సంక్షోభంలో ఉన్నాయని రాజన్‌ చెప్పారు. బ్యాంకుల్లో మొండి బాకీలు కూడా తోడవడంతో రుణ వితరణ వృద్ధి ఉండటం లేదన్నారు. సామాన్యుల నుంచి కార్పొరేట్ల దాకా అందరి రుణభారం, యువతలో నిరుద్యోగిత పెరిగిపోతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భూ సమీకరణ, కార్మిక చట్టాలపరమైన సంస్కరణలు, స్థిరమైన పన్నులు.. నియంత్రణా వ్యవస్థల విధానాలు అమలు చేయాలని రాజన్‌ సూచించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top