థాయ్‌ల్యాండ్‌ వీసా..మరింత ఈజీ!

eVisa On Arrival service For Fast And Convenient Entry Into Thailand - Sakshi

బ్యాంకాక్‌ : తమ దేశంలోని అందమైన ప్రాంతాలను వీక్షించాలని ఆరాటపడే పర్యాటకుల కోసం థాయ్‌ల్యాండ్‌ వీసా నిబంధనలను మరింత సులభతరం చేసింది. రోజుల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా అతి తక్కువ సమయంలో వీసా పొందేలా ఈవీసా ఆన్‌ అరైవల్‌(eVOA) అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా ఇంట్లో లేదా ఆఫీసులో కూర్చునే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుని 24 నుంచి 72 గంటల్లోగా వీసా పొందవచ్చు. బ్యాంకాక్‌లోని సువర్ణ భూమి, డాన్‌ మెంగ్‌ ఎయిర్‌పోర్టులు అదే విధంగా ఫుకెట్‌, చియాంగ్‌ మై ఎయిర్‌పోర్టుల ద్వారా థాయ్‌ల్యాండ్‌లో ప్రవేశించే టూరిస్టులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అంతేకాదు 14 జనవరి నుంచి ఏప్రిల్‌ 30 వరకు అప్లై చేసుకున్న వారిలో కొంత మందిని ఎంపిక చేసి ఫీజు మినహాయిస్తున్నట్లు కింగ్‌డమ్‌ ఆఫ్‌ థాయ్‌ల్యాండ్‌ మినిస్ట్రీ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది కూడా. భారత్‌ పాటు మరో 20 దేశాలకు ఈవీసా ఆన్‌ అరైవల్‌(eVOA) అవకాశాన్ని కల్పించింది.

ఈవీసా ఆన్‌ అరైవల్‌ అప్లై చేసే విధానం
1. thailandevoa.vfsevisa.com వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాలి.
2. వీసా అప్లికేషన్‌ ఫామ్‌ను నింపి..సంబంధిత డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాలి.
3. ఈవీసా ఆన్‌ అరైవల్‌కు సంబంధించిన వివరాలతో 24 నుంచి 72 గంటల్లోగా మెయిల్‌ వస్తుంది. ఫ్లైట్‌ టిక్కెట్లు, బస చేసే హోటల్‌ వివరాలు, ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌ ఈవీఓఏ అప్లికేషన్‌తో జతచేసిన కారణంగా వెరిఫికేషన్‌ కోసం క్యూలైన్లలో నిలబడాల్సిన పనిలేదు. అలాగే వీసా ఫీజు చెల్లింపు కూడా సులభతరం అవుతుంది.  ఇక ఈపాటి సమయం కూడా వృథా కాకూడదని భావించే వారి కోసం ‘ఎక్స్‌ప్రెస్‌ ఈవీసా ఆన్‌ అరైవల్‌’ ద్వారా 24 గంటల్లోపే వీసా పొందే అవకాశం కల్పిస్తోంది. అయితే ఇందుకోసం అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ విషయం గురించి థాయ్‌లాండ్‌ ఇమ్మిగ్రేషన్‌ ముఖ్య అధికారి సురాచత్‌ హక్‌పర్న్‌ మాట్లాడుతూ... ‘డిజిటల్‌ యుగంలో ఆధునిక పర్యాటకుల కోసం కొత్త విధానాన్ని రూపొందించాం. సుమారు 21 దేశాలకు అవకాశం కల్పించాం. టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈవీసా ఆన్‌ అరైవల్‌ విధానం తీసుకువచ్చాం. తద్వారా ప్రయాణికులకు వీసా సులభంగా అందుబాటులోకి రావడంతో పాటు భద్రతా ప్రమాణాలు కూడా మెరుగుపరచుకోవచ్చు. ప్రభుత్వం, వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ టెక్నాలజీల భాగస్వామ్యంతో ఈవీసా ఆన్‌ అరైవల్‌ రూపొందించాం అని పేర్కొన్నారు.

కాగా.. ‘ ఈవీసా ఆన్‌ అరైవల్‌ ద్వారా రిలయబిలిటీ పెంచవచ్చు. అదే విధంగా వీసాల ఏజెంట్ల బారిన పడే ప్రమాదం తప్పుతుంది. ఈ విధానం ద్వారా పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది’ అని వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ గ్రూపు సీఈఓ జుబిన్‌ కర్కారియా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక థాయ్‌ల్యాండ్‌తో పాటుగా కాకుండా టర్కీ, జోర్డాన్‌, కంబోడియా, మయన్మార్‌, తైవాన్‌, ఇండోనేషియా, మాల్దీవులు తదితర దేశాలు భారత పర్యాటకులకు ఈవీసా సదుపాయాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top