ఐటీ మినహాయింపు పరిమితి... రెట్టింపు చేయాలి | Ernst & Young survey on pre-budget survey | Sakshi
Sakshi News home page

ఐటీ మినహాయింపు పరిమితి... రెట్టింపు చేయాలి

Jan 23 2017 2:14 AM | Updated on Aug 21 2018 9:33 PM

ఐటీ మినహాయింపు పరిమితి... రెట్టింపు చేయాలి - Sakshi

ఐటీ మినహాయింపు పరిమితి... రెట్టింపు చేయాలి

మరో పది రోజుల్లో మోదీ సర్కారు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

కార్పొరేట్లకు రాయితీలు, మినహాయింపులు కొనసాగించాలి
ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ప్రీ–బడ్జెట్‌ సర్వేలో అభిప్రాయం  


న్యూఢిల్లీ: మరో పది రోజుల్లో మోదీ సర్కారు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా  వేతనజీవులకు భారీగా ఊరట కల్పించాలన్న డిమాండ్‌ ఎక్కువగా వినబడుతోంది. ఈసారి ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని(ఇప్పుడున్న రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు) ట్యాక్స్‌ కన్సల్టెన్సీ దిగ్గజం ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌(ఈవై) నిర్వహించిన ప్రీ–బడ్జెట్‌  సర్వేలో అత్యధికులు పేర్కొన్నారు.

అంతేకాకుండా కార్పొరేట్‌ కంపెనీలకు ఇస్తున్న రాయితీలు, మినహాయింపులను కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌) నేపథ్యంలో ప్రైవేటు పెట్టుబడులు, వినియోగ డిమాండ్‌ను పెంచాలంటే ఇవి తప్పనిసరి అని చెబుతున్నారు. వివిధ రంగాలకు చెందిన 200లకు పైగా సీనియర్‌ ట్యాక్స్‌ నిపుణులు, సీఎఫ్‌ఓల అభిప్రాయాలను సర్వేలో పొందుపరిచారు.

ముఖ్యాంశాలివీ...
కార్పొరేట్‌ ట్యాక్స్‌ను ఇప్పుడున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని(సర్‌చార్జ్, సెస్‌లు కాకుండా) సర్వేలో 81.42 శాతం మంది పేర్కొన్నారు.
‘మేకిన్‌ ఇండియా’కు ఊతమివ్వాలంటే రంగాలవారీగా పరిశ్రమలకు నిర్ధిష్టమైన రాయితీలు/మినహాయింపులు ఇవ్వాలని 72 శాతం మంది కోరారు.
వ్యక్తిగత ఐటీ మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని 60% మంది అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను గరిష్ట రేటులో 25 శాతం కోత విధించాలని 36% మంది అన్నారు. ప్రస్తుతం రూ.10 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను రేటు అమల్లో ఉంది.
‘వినియోగ వ్యయాన్ని పెంచేందుకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొన్ని పన్ను ప్రయోజనాలు అందించవచ్చన్న అంచనాలున్నాయి. డీమోనిటైజేషన్‌ తర్వాత బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి నిధుల ప్రవాహం, ప్రతిపాదిత వస్తు–సేవల పన్ను(జీఎస్‌టీ) అమలుతో పన్ను పరిధి పెరగవచ్చు’ అని ఈవై ఇండియా పార్ట్‌నర్, నేషనల్‌ ట్యాక్స్‌ లీడర్‌ సుధీర్‌ కపాడియా చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement