రెమ్‌డెసివిర్: డా. రెడ్డీస్‌ కీలక ఒప్పందం

Dr Reddy Inks Pact With Gilead Sciences To Manufacture COVID 19 Drug - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్స్‌ అమెరికా ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా వైరస్‌ కట్టడికి  ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లుగా భావిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్‌ రెమ్‌డెసివిర్ తయారీ, మార్కెటింగ్‌కి సంబంధించి భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు గిలియడ్‌తో నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందంపై డా. రెడ్డీస్‌ శనివారం ఒక  ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం భారత్‌ సహా 127 దేశాల్లో రెమ్‌డెసివిర్‌ రిజిస్ట్రేషన్‌, తయారీ, మార్కెటింగ్‌ చేసే వీలు కలుగుతుంది. ఇందుకు సంబంధించిన సాంకేతిక సహకారాన్ని గిలియడ్‌ సైన్సెస్‌ డా. రెడ్డీస్‌కు అందిస్తుంది. 

కాగా దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్, బయోకాన్ ఆర్మ్ సింజీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, జైడస్ కాడిలా లిమిటెడ్, ఈజిప్టుకు చెందిన ఇవా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ వంటి మరో నాలుగు సంస్థలతో తయారీ లైసెన్సు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు గిలియడ్ సైన్సెస్ తెలిపింది. అమెరికా, ఇండియా సహా మరికొన్ని దేశాల్లో కోవిడ్ -19 చికిత్సలో ప్రయోగత్మక  ఔషధంగా  భావిస్తున్న రెమ్‌డిసివిర్.. అత్యవసర వినియోగ అధికారాన్ని (ఇయుఎ) పొందిన నేపథ్యంలో ఈ  నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.(అమెరికన్‌ సంస్థతో జొమాటో ఒప్పందం..)

ఇదిలా ఉండగా.. దేశీయంగా సిప్లా లిమిటెడ్, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, హెటెరో డ్రగ్స్ లిమిటెడ్, మైలాన్  సంస్థలో ఇప్పటికే గిలియడ్‌ సంబంధిత భాగస్వామ్యాలను కుదుర్చుకుంది.  పాకిస్తాన్‌కు  చెందిన ఫిరోజాన్స్‌ లాబొరేటరీస్‌తో సహా మొత్తం మొత్తం తొమ్మిది కంపెనీలతో  ఈ డ్రగ్‌ తయారీ ఒప్పందాలను చేసుకుంది.  ఈ ఒప్పందం  ప్రకారం  127 దేశాలలో పంపిణీ కోసం రెమ్‌డెసివిర్‌ను తయారు చేయడానికి కంపెనీలను అనుమతిస్తుంది.  ఉత్పత్తిని మరింత త్వరగా పెంచడానికి , వారి ఉత్పత్తులకు వారి సొంత ధరలను నిర్ణయించడానికి వీలు కల్పిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top