ఏపీలో డావ్‌ ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ ప్లాంటు

DAO EVTech to unveil electric scooter in India this month - Sakshi

సుమారు రూ. 700 కోట్ల పెట్టుబడి

తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు

కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ అచ్యుతుని

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఉన్న చైనాకు చెందిన డావ్‌ ఈవీటెక్‌.. భారత్‌లో ఆటోమొబైల్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నానికి దగ్గరలో దీనిని నెలకొల్పనుంది. 200 ఎకరాల స్థలం కేటాయించాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ అచ్యుతుని సోమవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ఏటా 5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో ప్లాంటును ఏర్పాటు చేస్తామన్నారు. ఇంక్యుబేషన్‌ సెంటర్‌తోపాటు బ్యాటరీ, చాసిస్, కంట్రోలర్స్, మోటార్ల తయారీ సైతం ఇక్కడ చేపడతామని చెప్పారు. నవంబర్‌లో ఈ కాంప్లెక్స్‌ నుంచి తొలి ఉత్పాదన రెడీ అయ్యే అవకాశముందన్నారు. మూడేళ్లలో రూ.700 కోట్లు ఖర్చు చేస్తామని, ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. 40 దాకా అనుబంధ పరిశ్రమలు వస్తాయన్నారు.  

ఫిబ్రవరిలో తొలి వాహనం..
డావ్‌ ఈవీటెక్‌ భారత్‌లో తొలి వాహనాన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తోంది. వచ్చే ఏడాది ఆరు మోడళ్లను ప్రవేశపెడతామని డావ్‌ ఈవీటెక్‌ చైర్మన్‌ మైఖేల్‌ లియో వెల్లడించారు. అంతర్జాతీయంగా 25 ఏళ్లపాటు ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో సాధించిన అనుభవంతో భారత్‌లో అడుగుపెడుతున్నట్టు చెప్పారు. గంటకు 25 కిలోమీటర్ల లోపు వేగంతో ప్రయాణించే లో స్పీడ్‌ మోడళ్లు 3... అలాగే 25 కిలోమీటర్లకంటే వేగంగా ప్రయాణించే హై స్పీడ్‌ మోడళ్లు 3 అందుబాటులోకి తెస్తారు. వీటిలో ఇంటర్నెట్‌తో అనుసంధానించిన వాహనాలు కూడా ఉంటాయని కంపెనీ సీవోవో లానా జోయో తెలిపారు. కాగా, వాహనాల ధర లోస్పీడ్‌ అయితే రూ.50–75 వేలు, హై స్పీడ్‌ మోడళ్లు రూ.75 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది. ఒకసారి చార్జ్‌ చేస్తే మోడల్‌ను బట్టి 100–125 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. సొంత ప్లాంటు రెడీ అయ్యే వరకు హైదరాబాద్‌ సమీపంలోని తూప్రాన్‌ వద్ద ఉన్న అసెంబ్లింగ్‌ ప్లాంటులో టూ వీలర్లు రూపుదిద్దుకుంటాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top