నేటి నుంచి బొగ్గు కార్మికుల సమ్మె! | Coal workers to go on strike from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బొగ్గు కార్మికుల సమ్మె!

Jan 6 2015 1:31 AM | Updated on Sep 2 2018 4:16 PM

నేటి నుంచి బొగ్గు కార్మికుల సమ్మె! - Sakshi

నేటి నుంచి బొగ్గు కార్మికుల సమ్మె!

కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్‌సీసీఎల్) కార్మికులు మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు సమ్మె బాట పడుతున్నారు.

న్యూఢిల్లీ: కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్‌సీసీఎల్) కార్మికులు మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు సమ్మె బాట పడుతున్నారు. సమస్యల పరిష్కారానికి మంగళవారంనాడు ప్రభుత్వం ఒక సమావేశాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, కార్మికులు సమ్మెను ప్రారంభిస్తున్నారు.

ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్ కార్మిక సంస్థలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. బొగ్గు రంగం ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, కోల్ ఇండియా పునర్‌వ్యవస్థీకరణ వంటి అంశాలను నిరసిస్తూ కార్మికులు సమ్మె బాట పడుతున్నారు. ప్రతిపాదిత సమ్మె వల్ల విద్యుత్ సంస్థల ఉత్పత్తికి ఎటువంటి విఘాతం రాకుండా, సరఫరాలను పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా బొగ్గు కార్మికుల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు విద్యుత్ కార్మికుల సంఘం ఈఈఎఫ్‌ఐ ఒక ప్రకటనలో తెలిపింది.
 
కోల్ ఇండియా సీఎండీగా భట్టాచార్య బాధ్యతలు...
కోల్ ఇండియా పూర్తి స్థాయి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా సుతీర్థ భట్టాచార్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు.  ఇంతక్రితం భట్టాచార్య సింగరేణి కాలరీస్ కంపెనీ సీఎండీగా పనిచేశారు. తెలంగాణ ప్రభుత్వంలో చేరేందుకు 2014 మే నెలలో ఎస్.నరసింగరావు రాజీనామా చేసిన నాటి నుంచి, ఈ సంస్థ అత్యున్నత స్థాయి పదవి ఖాళీగా ఉంది.

గత ఆర్థిక సంవత్సరం సీఐఎల్ బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 482 మిలియన్ టన్నులు (ఎంటీ). అయితే 462 ఎంటీలు మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. 2019 నాటికి బిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్య సాధన లక్ష్యం. లక్ష్యాలను సాధించడమే కొత్త సీఎండీ ముందున్న ప్రధాన సవాలని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement