కంపెనీ బోర్డుల్లో యువతకు చోటేది?

CLSA Report on Youth in Company Boards - Sakshi

50 ఏళ్లలోపు సభ్యులు 7 శాతమే సభ్యుల సగటు వయసు 63

అనుభవానికే పెద్ద పీట యువతకు మొండి చేయి

అంతర్జాతీయంగా ఇదే పరిస్థితి.. సీఎల్‌ఎస్‌ఏ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: యువ జనాభా అత్యధికంగా కలిగిన భారత్‌ భవిష్యత్తు ఆర్థిక దిగ్గజంగా తప్పకుండా అవతరిస్తుందని ఎంతో మంది విశ్వసిస్తున్నారు. దేశ ఉత్పాదకతను పెంచేందుకు యువతరం మన విలువైన సొత్తు. కానీ, యువతకు ఉద్యోగ కల్పన విషయంలో కీలకమైన కార్పొరేట్‌ కంపెనీల బోర్డుల్లో మాత్రం... యువ నిపుణులకు తగిన చోటు లేదన్న వాస్తవం ఒప్పుకుని తీరాల్సిందే. కంపెనీల ‘బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ట్స్‌’ మరింత స్వతంత్రంగా, అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి చేరుతున్నా... ఒక్కటి మాత్రం లోటు కనిపిస్తోంది. బోర్డుల్లో అనుభవజు్ఞలు అవసరమైనప్పటికీ, అదే సమయంలో యువతకు కనీస ప్రాతినిధ్యం లేకపోవడం ఆలోచించాల్సిన అంశమే. బీఎస్‌ఈ100 కంనీల్లో 38 కంపెనీల బోర్డుల స్వరూపాన్ని సీఎల్‌ఎస్‌ఏ పరిశీలించగా... డైరెక్టర్ల సగటు వయసు 2019 మార్చి చివరికి 63గా ఉందని తెలిసింది. 2009 నాటికి ఉన్న 59 ఏళ్ల సగటు నుంచి పెరిగినట్టు స్పష్టమవుతోంది. దీనికితోడు స్వతంత్ర డైరెక్టర్ల పదవీ కాలం కూడా మరింత కుంచించుకుపోతోంది. కార్పొరేట్‌ మోసాలతో బోర్డుల స్వతంత్రత ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితుల్లో సీఎల్‌ఎస్‌ఏ అధ్యయనంలో ఈ ఫలితాలు వెలుగు చూడడం ఆలోచింపజేసేదే. ఈ నివేదికలోని వివరాలను పరిశీలిస్తే..

పరిమిత పాత్ర...
బోర్డుల్లో డైరెక్టర్ల సగటు వయసు పెరగడానికి ప్రస్తుత సభ్యుల వయసు పెరుగుతుండడమే ఒక కారణం. వీరంతా దశాబ్ద కాలంగా ఆయా కంపెనీల బోర్డుల్లో తిష్ట వేసిన వారే. బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లలో 30 శాతం వరకు మారకుండా ఉండడం సాధరణమేనన్నది సీఎల్‌ఎస్‌ఏ నిర్వచనం. ఎందుకంటే సాధారణంగా ప్రమోటర్లు, వారి సంబం«దీకులే బోర్డుల్లో ఎక్కువ మంది ఉండడంతోపాటు వారు రిటైట్‌ అవడానికి అంతగా ఇష్టపడరు. ఏదో ఫలానా రంగం, ఫలానా కంపెనీ అనేమీ లేదు. అన్ని చోట్లా యువతకు సరైన ప్రాతినిధ్యం అయితే లేదు. ఎందుకంటే 2018–19 ఆరి్థక సంవత్సరం నాటికి కేవలం కంపెనీల బోర్డు డైరెక్టర్లలో 7 శాతం మందే 50 ఏళ్లలోపు వారున్నారు. 2009 ఆరి్థక సంవత్సరం నాటికి ఉన్న 18 శాతంతో పోలిస్తే యువ నిపుణులకు చోటు తగ్గుతూ వచి్చనట్టు స్పష్టమవుతోంది. 

అనుభవానికే..  
అయితే, కంపెనీల బోర్డులు వయోభారంతో ఉండడం అన్నది కేవలం మన దేశంలో ఉన్న పరిణామమేమీ కాదు. నాస్‌డాక్‌ 100 కంపెనీలను పరిశీలించినా ఇదే తెలుస్తుంది. వీటి బోర్డుల్లో డైరెక్టర్ల సగటు వయసు 62గా ఉంది. అంటే మన కంపెనీలతో పోలిస్తే కేవలం ఏడాది తక్కువ. ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే నాస్‌డాక్‌100 అన్నది టెక్నాలజీ పరంగా అత్యాధునిక, దిగ్గజ కంపెనీలు. అంటే వీటితోపాటు, మన కార్పొరేట్‌ కంపెనీల్లోనూ అనుభవానికే పెద్ద పీట వేస్తున్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తరహా ధోరణితో ప్రమోటర్ల కుటుంబ సభ్యులు అయితే తప్పించి యువతకు బోర్డుల్లో చోటు కష్టంగా మారుతోందని సీఎల్‌ఎస్‌ఏ తన నివేదికలో వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. 

యువతరం అవసరమా..?
ఎస్‌అండ్‌పీ 500, నికాయ్‌ 225 కంపెనీల్లోనూ ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయి. వీటిల్లో డైరెక్టర్ల సగటు వయసు 63 సంవత్సరాలు. టెక్నాలజీ పరంగా ఎంతో ముందడుగు ఉన్న నేడు, భారత కంపెనీల బోర్డులకు మరింత యువరక్తం అవసరమా లేక అనుభవమే ముఖ్యమా అన్న ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుందని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. కంపెనీ బోర్డులో కనీసం సగం మంది స్వతంత్ర డైరెక్టర్లు, కనీసం ఒక మహిళా డైరెక్టర్‌ ఉండాలని కంపెనీల చట్టం 2013 స్పష్టం చేస్తోంది. 2015 ఏప్రిల్‌ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. దీంతో 2013–14 నాటికి బీఎస్‌ఈ 100 కంపెనీల్లో మహిళా డైరెక్టర్లు 7.9%గా ఉంటే, 2018–19 నాటికి ఇది 15.2%కి పెరిగింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top