బుల్లెట్‌ ట్రెయిన్‌: గంటకు 350కి.మీ | China runs world’s fastest commercial bullet train at 350km per hour | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ ట్రెయిన్‌: గంటకు 350కి.మీ

Sep 21 2017 7:11 PM | Updated on Sep 22 2017 10:02 AM

బుల్లెట్‌ రైళ్లకు పెట్టింది పేరైన చైనా ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే కమర్షియల్‌ బుల్లెట్‌ ట్రెయిన్‌ను గురువారం ప్రారంభించింది.

బీజింగ్‌: బుల్లెట్‌ రైళ్లకు పెట్టింది పేరైన చైనా ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే కమర్షియల్‌  బుల్లెట్‌  ట్రెయిన్‌ను గురువారం ప్రారంభించింది. ‘ఫ్యుక్సింగ్‌’గా పిలిచే ఈ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో  దూసుకుపోతుంది. బీజింగ్-షాంఘై హై-స్పీడ్ రైల్వే లైనులో గంటకు 350 కిలోమీటర్ల వేగంతో గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది.  దీంతో ఈ  రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం 4 గంటల 28 నిమిషాల మేర తగ్గనుంది. రోజూ 5,05,000 మంది ప్రయాణించే ఈ మార్గంలో తాజాగా అందుబాటులోకి తెచ్చిన  ఈ రైలుద్వారా  సుమారు గంట ప్రయాణ సమయం ఆదా కానుంది.

2008లో బుల్లెట్‌ రైళ్లను ప్రవేశపెట్టిన చైనా 2011లో వాటి వేగాన్ని గణనీయంగా తగ్గించింది.  ఆ ఏడాది జులైలో రెండు బుల్లెట్‌ రైళ్లు ఢీకొన్న ఘటనలో 40 మంది చనిపోగా. 190 మంది గాయపడ్డారు. అతివేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు వాటి వేగాన్ని నియంత్రించారు. మళ్లీ ఆరేళ్ల తర్వాత అత్యధిక వేగంతో నడిచే రైలును పునఃప్రారంభించారు. ప్రస్తుతం రైలు గంటకు అత్యధికంగా 400 కి.మీల వేగంతో ప్రయాణించే వీలున్నా, 350 కి.మీలకే పరిమితం చేశారు. ఈ వేగంతో ప్రయాణిస్తే 10శాతం విద్యుత్‌ ఆదా అవుతుంది.

సెక్యూరిటీ రీత్యా ఈ  బుల్లెట్‌ ట్రెయిన్‌ను అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు. అలాగే ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా విపత్తు ఎదురైతే రైలు దానికదే వేగాన్ని నియంత్రించుకునే ఏర్పాటు కూడా ఉంది.  రిమోట్‌ డేటా ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌తో కూడిన ఈ రైలులోని అన్ని బోగీల్లో వైఫై, మొబైళ్ల ఛార్జింగ్‌ పోర్టులు అందుబాటులో ఉంటాయి. 21 సెప్టెంబరు నుంచి ప్రతిరోజు ఏడు రౌండ్ ట్రిప్పులు  నడుస్తుంది. చైనాలో ప్రస్తుతం 20వేల కిలోమీటర్ల మేర బుల్లెట్‌ రైలు వ్యవస్థ ఉండగా.. 2020 నాటికి మరో 10వేల కిలోమీటర్ల మేర విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement