అప్పట్లో భారీ జరిమానా.. టిక్‌టాక్‌కు మరోదెబ్బ!

Advocacy Group Alleges TikTok Violated FTC Consent Decree - Sakshi

టిక్‌టాక్‌పై ఎఫ్‌టీసీకి అడ్వకసీ గ్రూపుల ఫిర్యాదు

వాషింగ్టన్‌: క్రేజీ యాప్‌గా వెలుగొందుతున్న చైనా సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌కు అమెరికాలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని ఉల్లంఘించారంటూ బెర్కెర్లీ మీడియా స్టడీస్‌ గ్రూప్‌, కన్జూమర్‌​ యాక్షన్‌, కన్జూమర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికా తదితర అడ్వైకసీ గ్రూపులు టిక్‌టాక్‌ యాజమాన్యంపై మండిపడ్డాయి. నిబంధనలు అతిక్రమించి.. అక్రమంగా సేకరించిన పదమూడేళ్ల లోపు పిల్లల డేటాను ఇంతవరకు తన ప్లాట్‌ఫాం నుంచి తొలగించలేదని ఆరోపించాయి. తద్వారా 2019 ఫిబ్రవరిలో ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్(ఎఫ్‌టీసీ)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని(కన్సెంట్‌ డిక్రీ) ఉల్లంఘించిందని పేర్కొన్నాయి. ఈ మేరకు టిక్‌టాక్‌పై గురువారం ఎఫ్‌టీసీకి ఫిర్యాదు చేశాయి. కాగా సినిమా డైలాగులు, పాటలకు, భావోద్వేగాలకు అనుగుణంగా వీడియోలు అప్‌లోడ్‌ చేయడం ద్వారా తమ టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశం ఉన్న టిక్‌టాక్‌ పట్ల... చిన్నా, పెద్దా అంతా ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే.(‘పిచ్చి యాప్‌.. టిక్‌టాక్‌ను నిషేధించండి’)

ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాకు చెందిన మ్యూజికల్‌.ఎల్‌వై(Musical.ly) అనే మరో యాప్‌ గ్రూపు టిక్‌టాక్‌తో 2018లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఎవరైనా సులభంగా అకౌంట్‌ క్రియేట్‌ చేసుకునే వీలు కల్పించింది. ఈ క్రమంలో తల్లిదండ్రుల అనుమతి లేకుండా పదమూడేళ్ల లోపు చిన్నారుల పేర్లు, ఫొటోలు తదితర వ్యక్తిగత వివరాలను బహిర్గత పరచిందంటూ ఎఫ్‌టీసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో టిక్‌టాక్‌.. అమెరికా జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిందని పేర్కొంటూ ఎఫ్‌టీసీ.. సంస్థ యాజమాన్యానికి 5.7 మిలియన్‌ డాలర్ల(దాదాపు 40. 60 కోట్ల రూపాయలు) భారీ జరిమానా విధించింది. ఈ విషయంపై స్పందించిన టిక్‌టాక్‌.. పిల్లలకు పూర్తి స్థాయిలో యాక్సెస్‌ కల్పించలేదని, తమ యూజర్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరణ ఇస్తూ జరిమానా చెల్లించింది. ఈ సందర్భంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాబోవని పేర్కొంటూ ఒప్పందంపై 2019లో సంతకం చేసింది.(‘చైనా యాప్‌ టిక్‌టాక్‌ను బహిష్కరించాలి’)

అయితే టిక్‌టాక్‌ ఎఫ్‌టీసీతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా పనిచేయడం లేదని అడ్వకసీ గ్రూపులు తాజాగా మరోసారి ఆరోపణలు చేశాయి. పిల్లలకు సంబంధించిన వీడియోలు ఇంకా ఆ యాప్‌లోనే ఉన్నాయని.. ఇది నిబంధనల ఉల్లంఘన అంటూ మరోసారి ఎఫ్‌టీసీని ఆశ్రయించాయి. అంతేకాకుండా యూజర్ల గోప్యత కోసం ఎటువంటి ప్రైవసీ పాలసీ అవలంబిస్తున్నామో తన హోం పేజ్‌లో పేర్కొనడంలో విఫలమైందని ఆరోపించాయి. ఇక ఇందుకు స్పందించిన టిక్‌టాక్‌ అధికార ప్రతినిధి హిలరీ మెక్‌క్వాడ్‌.. తాము నిబంధనలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. యూజర్ల గోప్యతకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వారికి భద్రతతో కూడిన వినోదాన్ని అందిస్తున్నామని తెలిపారు. గతంలో టిక్‌టాక్‌కు భారీ జరిమానా విధించిన ఎఫ్‌టీసీ ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది. (సోషల్ ‌మీడియా మార్గాన్వేషణ)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top