‘మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేద్దామనే’.. ఇరాన్‌పై అమెరికా యుద్ధంపై ట్రంప్‌ | Trump quip leaves japan pm awkward over pearl harbor | Sakshi
Sakshi News home page

‘మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేద్దామనే’.. ఇరాన్‌పై అమెరికా యుద్ధంపై ట్రంప్‌

Mar 20 2026 9:17 AM | Updated on Mar 20 2026 9:43 AM

Trump quip leaves japan pm awkward over pearl harbor

వాషింగ్టన్‌: సర్‌ప్రైజ్‌ చేద్దామనే ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న విషయాన్ని మిత్ర దేశాలతో పంచుకోలేని అమెరికా అధ్య‍క్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్, జపాన్ ప్రధానమంత్రి సనాఏ టకాఇచి మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల గురించి ప్రశ్నించగా, ట్రంప్ అనూహ్యంగా 1941లో జపాన్ చేసిన పెర్ల్ హార్బర్ దాడిని ప్రస్తావించారు.

ఇరు దేశాల ద్వైపాక్షి సమావేశంలో ఓ జపాన్‌ జర్నలిస్ట్‌.. ట్రంప్‌ను ఇలా ప్రశ్నించారు. ఇరాన్‌పై దాడి చేసే ముందు అమెరికా తన యూరప్‌,ఆసియా మిత్రదేశాలకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? అని అడిగారు. అందుకు ట్రంప్‌ స్పందిస్తూ.. ‘మేము దాడి చేయడానికి ముందు ఎక్కువ సంకేతాలు ఇవ్వదలుచుకోలేదు.  మేం సర్ ప్రైజ్‌ ఇవ్వాలనుకున్నాం. సర్‌ప్రైజ్‌ ఇవ్వడం జపాన్‌కు తెలిసినట్లుగా మరే ఇతర దేశానికి తెలియదు. పెర్ల్ హార్బర్ గురించి మీరు మాకు(అమెరికాకు) చెప్పలేదే!’అని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌పై దాడి విజయవంతమైందని, మొదటి రెండు రోజుల్లోనే 50శాతం కంటే ఎక్కువ లక్ష్యాలను ధ్వంసం చేశామన్నారు.  మేము ముందే చెప్పి ఉంటే అది సర్‌ప్రైజ్‌గా ఉండేది కాదని చెప్పారు. ‘ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో అక్కడి వాతావరణం గంభీరంగా మారింది. 

 దీనితో ఒక జర్నలిస్ట్‌ ట్రంప్‌ను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. వెంటనే ట్రంప్‌ ‘నేను కాదు, జపాన్‌ ప్రధాని టకాఇచి మాట్లాడాలి’ అన్నారు. అందుకు టకాఇచి ‘పర్లేదు, మీరు మాట్లాడండి’ అని సమాధానమిచ్చారు. ట్రంప్‌ ‘మీ ఇంగ్లీష్‌ చాలా బాగుంది. నేను మీ భాష నేర్చుకోలేదు, కానీ తప్పక నేర్చుకుంటాను’ అంటూ టకాఇచితో నవ్వులు పూయించారు.’ 

రెండో ప్రపంచ యుద్ధంలో
పెర్ల్ హార్బర్ దాడి 1941 డిసెంబర్ 7న జరిగింది. ఆ దాడిలో 2,390 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. తదుపరి రోజు అమెరికా జపాన్‌పై యుద్ధం ప్రకటించింది. అదే రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా ప్రవేశానికి కారణమైంది.

పశ్చిమాసియా యుద్ధంపై జపాన్‌ ఆందోళన   
ఇక జపాన్ ప్రధాని టకాఇచి పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రపంచం తీవ్రమైన భద్రతా పరిస్థితిని ఎదుర్కొంటోంది. గ్లోబల్ ఎకానమీ కూడా పెద్ద దెబ్బ తినబోతోంది. కానీ ప్రపంచ శాంతి సాధించగల వ్యక్తి మీరు మాత్రమే’ అని ట్రంప్‌ను ప్రశంసించారు. ఇరాన్ చేసిన దాడులు, హర్మూజ్‌ జలసంధి మూసివేతను ఖండించారు. అందుకు, ట్రంప్‌ స్పందిస్తూ శాంతి కోసం జపాన్‌ సైతం ముందుకు రావాలని కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement