టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయండి: నటుడు

Actor Kushal Tandon Urges Ban On TikTok Amid Covid 19 - Sakshi

ముంబై: చైనా యాప్‌ టిక్‌టాక్‌పై భారత్‌లో నిషేధం విధించాలని హిందీ టీవీ నటుడు, బేహద్‌ ఫేం కుశాల్‌ టాండన్‌ పిలుపునిచ్చాడు. పనీపాట లేని వాళ్ల కోసం చైనా ఈ యాప్‌ను తయారు చేసిందని.. తానెప్పుడూ ఈ పిచ్చి యాప్‌ను వాడలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రాణాంతక వైరస్‌ను ప్రపంచం మీదికి వదిలిన చైనాకు టిక్‌టాక్‌ వాడకంతో భారీ ఆదాయం సమకూరుతోందని.. కాబట్టి భారతీయులు ఈ యాప్‌ను నిషేధించడం ద్వారా ఆ దేశానికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశాడు. చైనాలోని వుహాన్‌ నగరంలో పురుడుపోసుకున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచమంతటా విస్తరిస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా కరోనా మరణాలు సంభవించగా.... 20 లక్షల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. 

ముఖ్యంగా అగ్రరాజ్యంలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. అంతేకాదు వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు సైతం అతలాకుతలం అవుతున్నాయి. భారత్‌లోనూ ప్రాణాంతక కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చైనా ఉత్పత్తులు, బ్రాండ్లు, యాప్‌లను నిషేధించాలంటూ కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కుశాల్‌ సైతం ఇదే వాదనను వినిపించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టా పేజ్‌లో చైనా కారణంగా ప్రపంచం అతలాకుతలం అవుతుంటే.. కొంతమంది భారతీయులు మాత్రం ఆ దేశాన్ని ఆదాయాన్ని ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. పనీపాటలేని వాళ్ల కోసమే ఆ యాప్‌. దానిని వాడనందుకు నేను గర్వపడుతున్నా. ఇప్పటికైనా టిక్‌టాక్‌ను నిషేధించండి’’అని తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ పోస్ట్‌ పెట్టాడు.

ఇక ఈ విషయంలో పలువురు కుశాల్‌కు మద్దతుగా నిలవగా.. వివేక్‌ దహియా వంటి ఇతర సెలబ్రిటీలు టిక్‌టాక్‌ కారణంగా కరోనా పుట్టలేదని.. దాని వల్లే కొన్ని అత్యవసర సమయాల్లో ప్రాణాలు నిలబడుతున్నాయని పేర్కొంటున్నారు. అంతేగాకుండా ఎంతో మంది సామాన్యులను సెలబ్రిటీలు చేసిన ఘనత టిక్‌టాక్‌కు ఉందని సుదీర్ఘ పోస్టులు పెడుతున్నారు. (‘చైనా యాప్‌ టిక్‌టాక్‌ను బహిష్కరించాలి’)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top