
చెన్నై: హిందూ తీవ్రవాదంపై హీరో కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలకు తను మద్దతును ప్రకటించిన విలక్షణ నటుడు, చిత్రనిర్మాత ప్రకాష్ రాజ్ బుధవారం నోట్ల రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ ప్రకటించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోషల్‌మీడియాలో ఆయన స్పందించారు. పెద్ద నోట్లను రద్దు చేసి పెద్ద తప్పు చేసిందనీ, దీనికి కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో విశేష ఆదరణ సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఇటీవల బాగా యాక్టివ్ అయ్యారు. ఈ నేపథ్యంలో నోట్ల రద్దుపై కూడా సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యల్నిపోస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
To whomsoever it may concern అనే టైటిల్‌తో ట్విట్టర్‌లో ఇటీవల వరస పోస్ట్‌లు పెడుతున్న ప్రకాష్‌రాజ్ ఇపుడు నోట్ల రద్దుపై తన ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. నల్లధనాన్ని నిరోధించేందుకు, ఉగ్రవాదులకు నిధులను అడ్డుకునే లక్ష్యంతో నవంబర్ 8, 2016 పెద్దనోట్ల రద్దును ప్రధాన నరేంద్ర మోదీ ప్రకటించారనీ, కానీ ధనికులు అనేక మార్గాల ద్వారా నల్లధనాన్ని కొత్తనోట‍్లతో మార్చుకుంటే లక్షలాది మంది ప్రజలు నిస్సహాయంగా బాధలుపడ్డారని, అలాగే అసంఘటిత రంగ కార్మికులు భారీ కష్టాలనెదుర్కొన్నారన్నారు. ఇంత పెద్ద తప్పు చేసినందుకు క్షమాపణలు చెపుతారా? అంటూ ట్వీట్ చేశారు.
కాగా ఇటీవల బెంగళూరులో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య పై ప్రధాని మోదీ మౌనాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. అలాగే హిందూ తీవ్రవాదంపై హీరో కమల్ హాసన్ అభిప్రాయాలకు మద్దతు పలికి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
This day... that age......#justasking... pic.twitter.com/LzcphBwQkz
— Prakash Raj (@prakashraaj) November 8, 2017