జిల్లాకు 16 సార్లు వచ్చి ఏం చేశావు?

YV Subba Reddy Slams Chandrababu Naidu - Sakshi

సీఎంపై చంద్రబాబుపై మాజీ ఎంపీ వైవీ ధ్వజం

శిలాఫలకాలతో ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపాటు

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో వెలిగొండ పూర్తి

ప్రకాశం, కనిగిరి: టీడీపీ అధికారంలోకి వచ్చే నాలుగున్నరేళ్లు దాటింది.. సీఎంగా చంద్రబాబు 16 సార్లు జిల్లాకు వచ్చారు.. శిలాఫలకాలు వేయడం తప్పా ప్రజకిచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలేదంటూ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. రాజన్న జల సంకల్పం కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ సొంత నిధులతో ఏర్పాటు చేసిన డీప్‌బోర్‌వెల్స్, ట్యాంకులను ఆదివారం ప్రారంభించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే వెలిగొండ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నాలుగున్నరేళ్ల పబ్బం గడుపుకుని మళ్లీ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తుంటే మళ్లీ ఇప్పుడు వెలిగొండ గూరించి మాయ మాటలు చెప్తున్నాడని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టుపై ప్రజలను టీడీపీ నేతలు ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలియజేసేందుకు తాను ఆగస్టులో ఐదు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టినట్లు వైవీ గుర్తు చేశారు. ప్రజలు టీడీపీ మాయమాటలు నమ్మె పరిస్థితిలో లేరన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో వెలిగొండ ప్రాజెక్టుకును పూర్తి చేసి పశ్చిమ ప్రాంతాలైన కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కొండపి నియోజకవర్గాలకు తాగు, సాగు నీటి సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో వైఎస్సార్‌ సంక్షేమ పాలలు ప్రజలకు అందిస్తామని వివరించారు. 

13 నీటి ట్యాంకుల ప్రారంభం
మున్సిపాలిటీలో నీటి సమస్య పరిష్కారానికి రాజన్న జల సంకల్పంలో భాగంగా బుర్రా సొంత నిధులు రూ.8 లక్షలతో కాశీపురం, అర్బన్‌ కాలనీ, రాజీవ్‌ కాలనీ, శివనగర్‌ కాలనీల్లో (1,2,11,10 వార్డుల్లో) ఏర్పాటు చేసిన డీప్‌బోర్‌వెల్‌ నీటి ట్యాంకులను బుర్రాతో కలిసి మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ కనిగిరి, కొండపి ప్రాంతాల్లో కిడ్నీ, ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కిడ్నీ, ఫ్లోరైడ్‌ సమస్యలపై వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేయడంతో ప్రభుత్వం కళ్లు తెరపించి డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. తన సొంత నిధులతో డీప్‌ బోర్‌వెల్, ట్యాంకులు నిర్మించి తాగు నీటి సమస్య తీర్చేందుకు బుర్రా కృషి చేయడాన్ని కొనియాడారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఏ విధంగా స్పందించి పనిచేస్తున్నారనేందుకు బుర్రా చేస్తున్న కృషే నిదర్శనమన్నారు. పార్టీ అధికారంలో లేకున్నా ప్రజలు తమ నీటి సమస్యను తెలపగానే ట్యాంకులు, బోర్‌వెల్స్‌ ఏర్పాటు చేస్తూ దాహార్తీ తీర్చుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటేయాలని మాజీ ఎంపీ వైవీ కోరారు. జెడ్పీటీసీ సభ్యుడు ప్రకాశం, ఎంపీపీ గాయం బలరాంరెడ్డి, పార్టీ నాయకులు రంగనాయకులు, వేల్పుల వెంకటేశ్వర్లు, బజాజ్‌ బుజ్జి, గోనా సదానందం, కోటిరెడ్డి, పెద్దిరెడ్డి, తిరుపతయ్య పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top