పంచాయతీలకు కొత్తరూపు!

YSRCP Implementing New Schemes For Public In East Godavari - Sakshi

సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి) : ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువ చేయడం.. వేగంగా లబ్ధిదారులకు అందజేయడమే లక్ష్యంగా నూతన సర్కారు గ్రామ సచివాలయాల వ్యవస్థకు మెరుగులు దిద్దుతోంది. దీనికి సంబంధించి ఓ వైపు గ్రామ వలంటీర్ల నియామకాలు చేపడుతూనే మరోవైపు కొత్త సచివాలయాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. ఇకపై ప్రభుత్వం నుంచి ఏ సేవలు కావాలన్నా, పథకాల లబ్ధి పొందాలన్నా గ్రామ సచివాలయాలే కీలకంగా మారనున్నాయి. ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా వలంటీర్లు వ్యవహరించనున్నారు. 

జిల్లా జనాభా 51,54,296
మొత్తం పంచాయతీలు 1072
ఏర్పాటు కానున్న గ్రామ సచివాలయాలు 916
గ్రామ వలంటీరు ఉద్యోగాలు 24,207
 అందిన దరఖాస్తులు 96,672

ఇదీ సంగతి
రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె పాలనలో నూతన అధ్యాయం ఆరంభమైంది. అందులో భాగంగా ఇప్పటికే గ్రామ వలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభించగా.. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కో పంచాయతీలో ఒక గ్రామ సచివాలయం నడుస్తోంది. అక్కడ నుంచే సర్పంచులు, కార్యదర్శులు పరిపాలన చేసేవారు. ఇక నుంచి పథకాల మంజూరుతో పాటు, పలు రకాల సేవలను సచివాలయాల నుంచే అందించేందుకు రూపకల్ప న జరుగుతోంది. జిల్లాలో జనాభా ప్రతిపాదికన మొత్తం 916 సచివాలయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఏజెన్సీలో 2 వేలు, మైదాన ప్రాంతాల్లో 
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కనీసం రెండు వేల జనాభాకో సచివాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 19 నియోజకవర్గాల పరిధిలో 64 మండలాలుండగా 1,072 పంచాయతీలున్నాయి. 51,54,296 మంది జనాభా ఉన్నారు. చివరిసారిగా 2011లో జనాభా గణన జరిగింది. అప్పటి గ్రామ జనాభాకు ప్రస్తుతం అదనంగా 15 శాతం కలుపుతారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు వేల జనాభా ఉన్న పంచాయతీలో ఓ సచివాలయం, మైదాన ప్రాంతాల్లో 3 వేల జనాభాను ప్రాతిపదికన తీసుకుని గ్రామ సచివాలయం ఏర్పాటు చేయనున్నారు. ఇవి కేవలం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు మాత్రమే ఉద్దేశించినవి. భౌగోళికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

ఒకేచోట పదిమంది ఉద్యోగులు
గ్రామ సచివాలయాల్లో పదిమంది ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. త్వరలోనే ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ సైతం మొదలు పెట్టనున్నారు. ఆ తర్వాత వారికి శిక్షణ ఇచ్చి అక్టోబర్‌ రెండో తేదీ నాటికి వారు విధుల్లో చేరేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయం, పశుసంవర్థక , రెవెన్యూ, వైద్యం, ఉద్యాన, అటవీ, సంక్షేమం, పంచాయతీరాజ్‌ శాఖలన్నింటిని జనానికి ఒకేచోట అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ సంకల్పం. జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈఓ, పీడీఓ, మండల స్థాయి ఎంపీడీఓలు పర్యవేక్షించనున్నారు. 

పక్కాగా ఏర్పాట్లు
గ్రామ సచివాలయాల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన చేపడుతోంది. వాటిని భౌగోళికంగా ప్రతిపాదించడంతో పాటు, అందుకు అనుబంధంగా ప్రత్యేకంగా స్కెచ్‌లు తయారు చేసి ఇవ్వాలి. ఏయే పంచాయతీలు సచివాలయాల పరిధిలోకి వస్తున్నాయన్నది అందులో రంగుల్లో గుర్తించేలా మార్కు చేశారు. వాటి పూర్తి వివరాలను పంచాయత్‌రాజ్‌ శాఖకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, పంచాయతీల విలీనంలో తప్పిదం జరిగినా భవిష్యత్తులో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందుకే పొరపాట్లకు ఆస్కారం లేకుండా పక్కా సమాచారం సేకరించారు.  

వలంటీరు పోస్టులకు దరఖాస్తుల వెల్లువ
గ్రామ స్థాయిలో ప్రతి 50 ఇళ్లకు ఓ గ్రామ వలంటీరును ప్రభుత్వం నియమించబోతోంది. దీనికి సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి గత నెల 24 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా 916 గ్రామ సచివాలయాల్లో 24,207 వలంటీరు ఉద్యోగాల భర్తీకి అవకాశం ఉండగా.. 96,672 దరఖాస్తులు అందాయి. ప్రస్తుతం వీరికి గ్రామ, పట్టణ స్థాయిల్లో ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. ఇందులో ఎంపికైన వారికి శిక్షణ అనంతరం ఉద్యోగ బాధ్యతలు అప్పగిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top