వైఎస్సార్‌సీపీ మరో అధ్యాయం

వైఎస్సార్‌సీపీ  మరో అధ్యాయం - Sakshi


 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల ఫలితాల తర్వాత అతి త్వరలోనే తేరుకుని ఇప్పటికే పలు ప్రజా సమస్యలపై పోరాటాలు ప్రారంభించిన ఆ పార్టీ జిల్లాలో మరింత బలపడేందుకు అన్ని హంగులతో, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన జిల్లా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది.

 

 సాక్షి, విశాఖపట్నం:వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కొత్త కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదివారం ప్రారంభించారు.   ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గతంలో ఏర్పాటు చేసిన కార్యాలయం హుద్‌హుద్ ధాటికి కూలిపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో కొత్త కార్యాలయం కోసం ప్రయత్నించి జగదాంబ సెంటర్ సమీపంలోని యల్లమ్మతోట ఎస్‌బీఐ మేడపైన ఏర్పాటు చేశారు.  

 

  జిల్లా పార్టీ అధ్యక్షుడితోపాటు, 12 అనుబంధ సంఘాల అధ్యక్షులకు ప్రత్యేక చాంబర్‌లు, సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ హాల్, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వసతి, భోజన సదుపాయాలు, లైబ్రరీ వంటి అన్ని హంగులతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. ఈ పరిణామం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. రానున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి పార్టీ కార్యాలయం ప్రారంభం నాంది పలికిందని ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అన్నారు.     

 

 ఈ కార్యక్రమంలో జిల్లా మహిళాధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలు కె.నిర్మలారెడ్డి, పీలా ఉమారాణి, యూత్ అధ్యక్షులు పూలరెడ్డి, బీజీ సెల్ అధ్యక్షుడు పక్కి దివాకర్, ప్రచార కమిటీ కన్వీనర్ బివి రవిరెడ్డి,భాస్కరయూత్ సభ్యుడు భాస్కర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 పార్టీలో చేరిన పీతల వాసు: విశాఖ దక్షిణ నియోజవర్గానికి చెందిన పీతల వాసు తన అనుచరులతో కలిసి విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు నిర్వహించిన వాసు వైఎస్సార్ సీపీపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు వెల్లడించారు. నేతలు వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి  ఆహ్వానించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి పాటుపడతామని ఈ సందర్భంగా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు ప్రతిజ్ఞ చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top