జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు తరలిరండి

జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు తరలిరండి - Sakshi


ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :మోసపూరిత వాగ్దానాలతో ఎన్నికల్లో గెలిచి, ప్రజలను నిలువునా ముంచిన చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన దీక్షకు జిల్లావ్యాప్తంగా లక్షలాది ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడ్డు ఆళ్ల నాని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. గత ఎన్నికల సమయంలో రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రతి రైతు, ప్రతి ఆడపడుచూ తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించవద్దని నమ్మకంగా చెప్పి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత కూడా చాలాకాలం రుణ  బకాయిలు చెల్లించవద్దని చెబుతూ వచ్చిన చంద్రబాబు ఆ తరువాత నిజ స్వరూపాన్ని బయటపెట్టారని నాని విమర్శించారు.

 

 తాము తీసుకున్న రుణాలు మాఫీ జరిగి తిరిగి కొత్త పంటకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరౌతాయని ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు ఎప్పటికప్పుడు అమలుకు సాధ్యంకాని నిబంధనలతో బాబు టోకరా ఇస్తూ వస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూతూ మంత్రంగా ప్రారంభించిన రుణమాఫీ విధానంతో లక్షల్లో రుణాలు తీసుకున్న రైతులకు రూపాయల్లో మాఫీ చేసినట్టు బ్యాంకుల నుంచి వర్తమానం అందుతుండడంతో రైతులు నెత్తీనోరూ బాదుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 చంద్రబాబు గతంలో కూడా తన పాలనలో రైతు వ్యతిరేక విధానాలే అనుసరించారని, మొసలి కన్నీరు కార్చి రైతుల సానుభూతి పొంది అధికారంలోకి వచ్చి తిరిగి తన రెండు నాల్కల ధోరణిని బయట పెట్టుకున్నారన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించమని ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులు జరపడం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేస్తే కరెంటు తీగలపై దుస్తులు ఆరేసుకోవాలని విమర్శించడం బాబు రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. మహిళల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వంటి ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి బాబు ఆయా వర్గాలను విజయవంతంగా మోసగించారని నాని విమర్శించారు.

 

 బాబు రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టి రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో  జిల్లాలోని తణుకులో తలపెట్టిన దీక్షను అన్నివర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి సోమవారం తణుకులో జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించనున్న దీక్షా స్థలిని పరిశీలించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా దీక్షకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరిస్తారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు జగన్ దీక్షపై రైతులు, మహిళలు, నిరుద్యోగుల్లో అవగాహన కలిగించి వారిని దీక్షకు స్వచ్ఛందంగా తరలివచ్చేలా చైతన్యపరచాలని నాని సూచించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top