రైతన్నలకు ఆసరాగా.. ‘వైఎస్సార్‌ అగ్రిల్యాబ్స్‌’

YSR AgriLabs Launched In Andhra Pradesh. - Sakshi

భూసార పరీక్షలు, ఎరువులు క్రిమిసంహారక మందుల్లోని నాణ్యతను తెలుసుకునేందుకు ల్యాబ్స్‌

వచ్చే ఖరీఫ్‌ నాటికి అందుబాటులోకి.. 147 గ్రామీణ నియోజకవర్గాల్లో ఏర్పాటు

13 జిల్లా స్థాయి పరీక్షా కేంద్రాలు 4 ప్రాంతీయ కోడింగ్‌ సెంటర్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్‌ నాటికి వైఎస్సార్‌ అగ్రిల్యాబ్స్‌ (వ్యవసాయ పరీక్షా కేంద్రాలు) ఏర్పాటు కానున్నాయి. భూసార పరీక్షలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల్లోని నాణ్యతను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తోంది. 147 గ్రామీణ నియోజకవర్గాల్లో అగ్రిల్యాబ్స్‌ ఏర్పాటు చేయనున్నారు. అలాగే 13 జిల్లాస్థాయి పరీక్షా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇవి కాకుండా 4 ప్రాంతీయ కోడింగ్‌ కేంద్రాలు, ఒక రాష్ట్రస్థాయి పరీక్షా కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేస్తున్నారు.

వీటికి రూ.200 కోట్ల వ్యయం అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అగ్రిల్యాబ్‌లకు అవసరమైన పరికరాల కొనుగోలుకు తొమ్మిది మందితో కూడిన నిపుణుల కమిటీని ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. నియోజకవర్గ స్థాయి పరీక్షా కేంద్రాల్లో విత్తనాల నాణ్యతను పరీక్షిస్తారు. జిల్లాస్థాయి పరీక్షా కేంద్రాల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ విత్తనాల జన్యుపరమైన పరీక్షలు జరుగుతాయి. విత్తన ఆరోగ్యం, మొక్కల ఎదుగుదల ఎలా ఉంటుంది? కొత్త విత్తనమా? పాత విత్తనమా? అనే వివరాలు తెలుసుకోవచ్చు. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, తిరుపతిలో ప్రాంతీయ కోడింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

వీటిన్నింటినీ పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను అరికట్టేడమే లక్ష్యంగా అగ్రిల్యాబ్‌లు పనిచేయనున్నాయి. పరీక్షల అనంతరం నాసిరకం విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వాటిని తయారు చేసిన సంస్థలు, విక్రయించిన వ్యాపారులపై చట్టప్రకారం చర్యలు చేపడుతుంది. ‘నాబార్డు’ ఆర్థిక సాయంతో ఏర్పాటు కానున్న అగ్రిల్యాబ్‌లను మార్కెటింగ్, పోలీస్‌ హౌసింగ్‌ శాఖలు నిర్మిస్తాయి.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top