నాలో... నాతో.. వైఎస్సార్‌

YS Vijayamma wrote book on YSR and will be unveiled on 8th July - Sakshi

వైఎస్‌ విజయమ్మ పుస్తకావిష్కరణ నేడు  

మహా నేత ప్రతి అడుగు వెనక ఉన్న ఆలోచనలు..  

అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలపై విశ్లేషణ

ప్రతి ఒక్కరి ప్రగతి.. ఇంటింటా అందరికీ మేలు  

అందుకే ఆయనను ఇప్పటికీ ఆరాధిస్తున్నారు..

విజయమ్మ మనోగతం.. భావోద్వేగాల సమాహారం 

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ రాసిన ‘‘నాలో... నాతో... వైఎస్సార్‌’’పుస్తకాన్ని, మహానేత 71వ జయంతి సందర్భంగా బుధవారం ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన మాతృమూర్తి రాసిన ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఇడుపులపాయలో ఆవిష్కరిస్తారని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్‌ సహధర్మచారిణిగా విజయమ్మ 37 ఏళ్ల జీవితసారం ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న అనూహ్యంగా వైఎస్‌ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ పుస్తకం. ‘మహానేత గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజల నుంచి తెలుసుకున్నానని, ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చాను’అని విజయమ్మ తన తొలి పలుకుల్లో చెప్పారు. వైఎస్‌ ఒక తండ్రిగా, భర్తగా, ఎలా ఉండేవారో ఈ పుస్తకం ఆవిష్కరించింది. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా... నిజ జీవితంలో వైఎస్సార్‌ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండే వారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో విజయమ్మ వివరించారు. 

ఆమె ఇంకా ఏం పేర్కొన్నారంటే... 
► మహానేత వేసిన ప్రతి అడుగు వెనకా ఉన్న ఆలోచనను, అనుభవాల నుంచి ఆయన నేర్చుకున్న పాఠాలను ఈ పుస్తకంలో విశ్లేషించారు.
 
► ఆయన, ఇంట గెలిచి రచ్చ గెలిచిన తీరును; ఇంట్లో వారి అవసరాలను అర్థం చేసుకున్నట్టే ప్రజలనూ కుటుంబ సభ్యులుగా భావించి వారి అవసరాలను అర్థం చేసుకున్న విధానాన్ని వివరించారు. 

► కుటుంబ సభ్యుల ప్రగతిని కోరినట్టే రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రగతినీ కోరుకుని, ఇంటింటా అందరికీ మేలు చేయబట్టే తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే రాష్ట్ర ప్రజలంతా ఆయనను ఇప్పటికీ ఆరాధిస్తున్నారు. 

► వైఎస్‌ తన జీవితమంతా పంచిన మంచితనమనే సంపద తన పిల్లలూ మనవలకే కాకుండా..ఇంటింటా పెరగాలనే సంకల్పంతోనే ఈ పుస్తకాన్ని సవినయంగా సమాజం ముందుంచుతున్నా. 

► ఆయన్ను ప్రేమించిన తెలుగు ప్రజలందరికీ ఈ పుస్త కాన్ని అంకితం చేస్తున్నానని విజయమ్మ అన్నారు.  

► తమ వివాహం, ఆ నాటి పరిస్థితులు, పేదల వైద్యుడిగా వైఎస్సార్, రాజకీయాల్లో ఆయన రంగ ప్రవేశం, చిన్ననాటి నుంచి ఆయన నాయకత్వ లక్షణాలు, పేదల పట్ల కరుణ, రాజకీయాల్లో ఆటుపోట్లు, కుటుంబంలో ఆత్మీయతలు, పిల్లల చదువులు, వివాహాలు, దైవం పట్ల భక్తి శ్రద్ధలు, పీసీసీ అధ్యక్షుడిగా మొదలు ముఖ్యమంత్రి వరకు ఎదురైన ఒత్తిడులు, ప్రజా ప్రస్థానం, వైఎస్‌ జగన్‌; షర్మిలలతో.. వారి కుటుంబాలతో మహానేత అనుబంధాలు; మహానేత మరణంతో ఎదురైన పెను సవాళ్లు, వైఎస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణం చేసేవరకు పరిణామాలు.. ఇవన్నీ ఈ పుస్తకంలో రేఖామాత్రంగా కొన్ని, వివరంగా మరికొన్నింటిని వివరించారు.  

► తాను మరణించినా తన పథకాల్లో ఎప్పటికీ జీవించి ఉన్న, ప్రజలంతా తన కుటుంబమే అనుకున్న మహానేత గురించి రాబోయే తరాలకు కూడా స్ఫూర్తి ఇవ్వాల న్న సత్సంకల్పంతో ఈ పుస్తకాన్ని ప్రజలముందుంచుతున్నానని అన్నారు. ఆయన జీవితమే తెరిచిన పుస్తకమని, ప్రజాప్రస్థానంలో ప్రతి అడుగూ ప్రజల జీవితంతోనే ముడిపడి ఉందని విజయమ్మ వివరించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top