హైకోర్టులో పిటిషన్‌ తేలనివ్వండి

YS Jaganmohan Reddy Answers SIT In Charge About His Testimony - Sakshi

అంతవరకూ నా వాంగ్మూలం నమోదు వాయిదా వేయండి

సిట్‌ నోటీసుకు ఇచ్చిన సమాధానంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

సాక్షి, హైదరాబాద్‌: విశాఖపట్నం విమానాశ్రయంలో తన మీద జరిగిన హత్యాయత్నంపై స్వతంత్ర సంస్థ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌ పరిష్కారమయ్యేంత వరకు తన వాంగ్మూలం నమోదును వాయిదా వేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఇన్‌చార్జిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కోరారు. తాను దాఖలు చేసిన పిటిషన్‌ హై కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఆయనీ సందర్భంగా సిట్‌ ఇన్‌చార్జికి గుర్తు చేశారు. జగన్‌ మీద జరిగిన హత్యాయత్నం ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

దర్యాప్తులో భాగంగా వాంగ్మూలం నమోదు నిమిత్తం తమ ముందు హాజరు కావాలని, లేనిపక్షంలో స్థలం, సమయం, తేదీ చెబితే తామే వాంగ్మూలం నమోదుకు వస్తామంటూ సిట్‌ ఇన్‌చార్జి బి.వి.ఎస్‌.నాగేశ్వరరావు గత నెల 27న సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద జగన్‌కు నోటీసు ఇచ్చారు. ఈ నోటీసుకు జగన్‌ సమాధానమిచ్చారు.

‘‘నాపై 25.10.2018న విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. నేర న్యాయ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై రాష్ట్ర హోంశాఖ, డీజీపీ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ నేను హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాను. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 27.11.2018కి వాయిదా వేసింది. నేను దాఖలు చేసిన పిటిషన్‌ హైకోర్టులో అపరిష్కృతంగా ఉన్న నేపథ్యంలో.. దానిని పరిగ ణనలోకి తీసు కుంటూ నా పిటిషన్‌ పరిష్కారమయ్యేంత వరకు నా వాంగ్మూలం నమోదును వాయిదా వేయండి’’ అని జగన్‌ తానిచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. ఈ సమాధానాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ ద్వారా బుధవారం సాయంత్రం సిట్‌ ఇన్‌చార్జికి అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top