'సీఎంగా ఉండి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు'

'సీఎంగా ఉండి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు' - Sakshi


హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆదివారం దాచేపల్లి-మాచవరం మండలాల రైతులను కలిసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు.  ప్రజావ్యతిరేకతను తప్పించుకోవడానికి చంద్రబాబు దిగజారుడుతనానికి పాల్పడుతున్నారన్నారు. ఆయన మోసాలను ప్రశ్నించడానికి దాచేపల్లి-మాచవరం మండలాల నుంచి పెద్ద ఎత్తున రైతులు హైదరాబాద్ కు వస్తే.. వారిని అన్యాయంగా పోలీసులతో అరెస్ట్ చేయించారని జగన్ తెలిపారు. రైతుల ముఖాల్లో ఆనందం చూడటం కోసమే ఎకరాన్ని మూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేశామన్నారు.


 


ఫ్యాక్టరీ నిర్మాణానికి కావాల్సిన అనుమతిలన్నీ వచ్చినా.. ఏపీ ప్రభుత్వం నుంచి మాత్రం అనుమతులు రాలేదన్నారు. నీళ్లు, కరెంటు లేనిదే ఏ పరిశ్రమను స్థాపించలేమని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పరిశ్రమల స్థాపనకు నీళ్లు, కరెంటు ఇవ్వాల్సిన ధర్మం ప్రభుత్వంపై ఉందన్నారు. సరస్వతి సిమెంట్ కు అనుమతులు ఇవ్వకపోగా, మైనింగ్ లీజ్ రద్దు చేయడం చంద్రబాబు కక్ష సాధింపులో ఒక భాగమేనన్నారు. దాచేపల్లి-మాచవరం మండలాల్లో మరో ఏడు పరిశ్రమలకు అనుమతులు లభించినా.. ఇప్పటివరకూ ఏ ఫ్యాక్టరీని స్థాపించకపోవడం సిగ్గు చేటన్నారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి భూములను ఎందుకు రద్దు చేయలేదని జగన్ ప్రశ్నించారు. కోర్టులను ఆశ్రయించైనా సరస్వతీ సిమెంట్ ఫ్యాక్టరీలను పెట్టి తీరుతామన్నారు. దేవుడు చంద్రబాబు కు మొట్టికాయలు వేసే రోజు దగ్గరపడిందని జగన్ స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top