
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ దేశాల అంబాసిడర్లు, హై కమిషనర్లు, కాన్సులేట్ జనరల్స్‌తో ఈ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సౌత్ కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, టర్క్ మెనిస్థాన్, మాయన్మార్, కిర్గిస్థాన్, పోలాండ్, బల్గేరియా రాయబారులు.. బోట్స్‌వాన, శ్రీలంక హై కమిషనర్లతో పాటు డెన్మార్క్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్స్, యూకే డిప్యూటీ హై కమిషనర్ పాల్గొన్నారు.
ప్రపంచ దేశాల నుంచి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన శుక్రవారం విజయవాడలో డిప్లొమాటిక్ ఔట్‌రీచ్ పేరిట వాణిజ్య దౌత్య సదస్సు నిర్వహించారు. భారత విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా వాణిజ్యం, పెట్టుబడులకు అంతర్జాతీయ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారిందన్న విషయాన్ని చాటి చెప్పారు. 35కు పైగా దేశాల రాయబారులు, ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.