దొంగలు బాబోయ్ దొంగలు! | women's neck chain, theft | Sakshi
Sakshi News home page

దొంగలు బాబోయ్ దొంగలు!

Jul 28 2015 1:10 AM | Updated on Aug 30 2018 5:27 PM

దొంగలు జోరుమీదున్నారు. తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే చాలు కొల్లగొడుతున్నారు. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు గొలుసులు తెంచుకెళ్తున్నారు.

తాళంవేసి కనిపిస్తే ఇల్లు గుల్ల్లే
మహిళల మెడలో గొలుసుల చోరీ

 
విజయవాడ సిటీ : దొంగలు జోరుమీదున్నారు. తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే చాలు కొల్లగొడుతున్నారు. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు గొలుసులు తెంచుకెళ్తున్నారు. సీసీఎస్ పునర్‌వ్యవస్థీకరణ బలం వీరిని ఏమాత్రం నిలువరించలేకపోతోంది. గత ఏడాది మొదటి ఆరు నెలలతో పోల్చితే రాత్రి చోరీలు మినహా మిగిలిన నేరాల్లో దొంగలదే పైచేయి. పాత కేసుల్లో, పొరుగు జిల్లాల్లో చేసిన నేరాల్లో నిందితులను పట్టుకోవడం మినహా సీసీఎస్ సాధించిన పురోగతి ఏమీ లేదని చెప్పవచ్చు. ఆరు నెలల వ్యవధిలో చోరీల సంఖ్య భారీగానే ఉంది. వేసవిలో రాత్రి చోరీలు తగ్గినప్పటికీ మిగిలిన చోరీలు పెరిగాయి. నిఘా లోపం, నేరస్తులను గుర్తించడంలో సీసీఎస్ నిఘా(ఇంటిలిజెన్స్) విభాగం వైఫల్యం చెందింది. ఒకే రోజు నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో గొలుసు దొంగలు విజృంభించడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనం. అది మరువక ముందే ఆదివారం రాత్రి గుణదలకు చెందిన వృద్ధురాలి మెడలో ఆగంతకులు గొలుసు తెంచుకుపోయారు. ఇంటి చోరీలు సగటున రోజుకు రెండు జరుగుతున్నాయి. కొన్ని చోరీలు పోలీసులు నమోదు కూడా చేయడం లేదు. అదేమంటే బాధితులనే బాధ్యులను చేస్తూ మానసిక   వేధనకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వనిపిస్తున్నాయి.

 కొత్త దొంగల దృష్టి
 నగరంపై కొత్త దొంగలు దృష్టిసారించినట్టు పోలీ సులు అంగీకరిస్తున్నారు. మెజారిటీ చోరీల్లో నేరస్తుల వేలి ముద్రలు, ఇతర ఆధారాలు దొరక్కపోవడమే ఇందుకు నిదర్శనం. సులువుగా డబ్బు సంపాదిం చేందుకు అలవాటుపడిన యువత నేరాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. పొరుగు ప్రాంతాల నుంచి ఇక్కడి వారితో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని వీరు నేరాలు చేస్తున్నారు. పాత దొంగల సహకారంతోనే వీరు చోరీలకు పాల్పడుతున్నట్టు అనుమానాలు ఉన్నాయి. వారిచ్చిన సమాచారం ఆధారంగా దొంగలు తెగబడి నేరాలు చేస్తున్నారు. ఆపై           సులువుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు      తిరుగుతున్నారు.

 అటకెక్కుతున్న పాత కేసులు
 పోలీసుల ఉదాసీనత కారణంగా పాత కేసుల్లో నేరస్తులు చిక్కడం లేదు. అనేక కేసుల్లో విచారణ పెండింగ్‌లో ఉంది. పేరు మోసిన దొంగల ఆచూకీ కోసం దృష్టిపెడుతున్న సీసీఎస్ పోలీసులు ఇతర నేరగాళ్లను పట్టించుకోవడం లేదు. పేరున్న నేరస్తులు జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆనుపాళ్లు తెలుసుకొని అరెస్టు చేస్తున్నారు. వారి నుంచి రికవరీ చేసే సొత్తులో ఇతర ప్రాంతాలకు చెందినవే ఎక్కువగా ఉండటం ఇందుకు నిదర్శనం. కొత్త నేరస్తులను గుర్తించడంలో సీసీఎస్ నిఘా విభాగం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సీసీఎస్ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత స్టేషన్ స్థాయిలో క్రైం సిబ్బందిని తొలగిం చారు. కేసుల నమోదు, గస్తీ బాధ్యతలను శాంతిభద్రతల విభాగం పోలీసులకు అప్పగించారు. ఉన్న కేసుల దర్యాప్తుకే సమయం సరిపోవడం లేదని చెపుతున్న లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆస్తి నేరగాళ్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో నేరగాళ్ల సమాచారం పోలీసులకు చేరడం లేదు.

 తనఖాతో మస్కా
 గతంలో చోరీ సొత్తును నేరగాళ్లు బంగారు నగల షాపుల్లో విక్రయించేవారు. ఈ క్రమంలో నేరగాళ్ల ఆచూకీ షాపుల నిర్వహకుల ద్వారా పోలీసులకు ఇట్టే తెలిసిపోయేది. ప్రైవేటు ఆర్థిక సంస్థల రంగ ప్రవేశంతో పరిస్థితి మారింది. తగిన గుర్తింపు పత్రాలు ఉంటే చాలు ఆయా సంస్థల్లో నగలు తనఖా పెట్టుకోవచ్చు. నగల షాపుల్లో విక్రయిస్తే చోరీ సొత్తు కాబట్టి అరకొర నగదు ఇచ్చేవారు. ఇదే ఆర్థిక సంస్థల్లో తనఖా పెడితే 70 నుంచి 80 శాతం మేర నగదు రావడంతో దొంగలు తెలిసిన వ్యక్తుల ద్వారా తనఖాకే మొగ్గు చూపుతున్నారు. నేరగాళ్ల ఆచూకీ పోలీసులకు తెలియకపోవడానికి ఇది కూడా కారణం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement