సాక్షి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ: కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ నగదు లెక్కింపులో ఓ సేవకుడు చేతివాటం చూపించాడు. స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు కోసం రామచంద్రపురం మండలం వేగాయమ్మ పేటకు చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావు వచ్చాడు.
అనపర్తి మాణిక్యాంబ సమేత భీమేశ్వర సేవా సంఘం సభ్యుడిగా నగదు లెక్కింపులో శ్రీనివాసరావు పాల్గొన్నాడు. అయితే భోజన విరామ సమయంలో 25000 తస్కరించి బయటికి వెళ్తుండగా గార్డులు పట్టుకున్నారు. దాంతో తన ద్విచక్ర వాహనం కూడా తనిఖీ చేశారు.
అందులో కూడా మరో ముప్పై ఐదు వేలు నగదును సిబ్బంది గుర్తించారు. మొత్తం రూ. 60,000 హుండీ సొమ్మును శ్రీనివాసరావు దొంగతనం చేసినట్టు అధికారులు నిర్ధారించారు. అనంతరం వాడపల్లి ఆలయ ఈవో చక్రధర్ రావు శ్రీనివాసరావును పోలీసులకు అప్పగించారు. ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు ఆత్రేయపురం పోలీసులు తనపై కేసు నమోదు చేశారు.

హుండీ లెక్కింపులో చేతివాటానికి పాల్పడిన శ్రీనివాసరావు టిడిపి కార్యకర్తగా గుర్తింపు
కార్తీక మాసంలో పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో నెలరోజుల కార్యక్రమాల పర్యవేక్షణకు మంత్రి సుభాష్ వేసిన అనధికార కమిటీలో సభ్యునిగా శ్రీనివాసరావు కొనసాగినట్టు సమాచారం. ప్రముఖ ఆలయాల హుండీలు లెక్కింపునకు సేవకునిగా శ్రీనివాసరావు వెళ్తున్నాడు. కాగా గతంలోనూ టిడిపి హయాంలో వాడపల్లి ఆలయంలో ట్రస్ట్ బోర్డు సభ్యుడు చేతివాటం ప్రదర్శించాడు.


