‘బాబో’య్‌ ! | Womens gets angry with Chandrababu regular meetings in vijayawada   | Sakshi
Sakshi News home page

‘బాబో’య్‌ !

May 8 2018 10:46 AM | Updated on Aug 10 2018 8:42 PM

Womens gets angry with Chandrababu regular meetings in vijayawada   - Sakshi

సభా ప్రాంగణంలో జనం లేక ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు

సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబు సభలతో ప్రజలు బేజారవుతున్నారు. ఆశా, డ్వాక్రా, అంగన్‌వాడీ తదితర రంగాలకు చెందిన మహిళల్ని బలవంతంగా సభలకు తరలిస్తున్నారు. ఇష్టం లేకపోయినా అధికారుల ఒత్తిడి మేరకు ఆయా శాఖల పరిధిలో పనిచేసే మహిళలు సభలకు వస్తున్నా మధ్యలోనే వెళ్లిపోతున్నారు. జనం తరలింపు అధికారులకు సైతం తలనొప్పిగా మారింది. ప్రత్యేక హోదా పేరుతో గత నెలలో ధర్మ పోరాటదీక్ష.. బాలికల సంరక్షణ...అందరి బాధ్యత పేరుతో  సోమవారం మరో కార్యక్రమం చేపట్టారు. సభలో ఏడు గ్యాలరీలకు గాను కేవలం రెండు గ్యాలరీలు మాత్రమే నిండాయి. సమావేశం చీకటి పడిన తరువాత ప్రారంభం కావడంతో మహిళలు వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. సీఎం ప్రసంగం కాకపోవడంతో గేట్లు మూసివేసి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు.

తలనొప్పిగా తరలింపు...
సీఎం చంద్రబాబు  ప్రతి నెలా నగరంలో ఒక సభ నిర్వహించడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇంతకాలం ప్రజల మనోభావాల్ని కానీ, వారి సమస్యల పట్ల కానీ స్పందించని ముఖ్యమంత్రి మరో ఏడాది కాలంలో ఎన్నికలుండటంతో ప్రజల మధ్యకు వచ్చి సభలు, దీక్షలు నిర్వహించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సభలకు ప్రజల్ని తరలించడం అధికారులకు కత్తిమీద సాముగా ఉంది. ప్రభుత్వ పక్షాన నిర్వహిస్తున్న కార్యక్రమాలకు జనాల్ని తరలించే బాధ్యత అధికారులకే అప్పగిస్తున్నారు. ఆశావర్కర్లు, డ్వాక్రా వర్కర్లు, అంగన్‌వాడీ తదితర రంగాలకు చెందిన మహిళల్ని తరలించే బాధ్యత మహిళా,శిశు సంక్షేమ శాఖకు, వాహనాలు సమకూర్చే బాధ్యత రవాణాశాఖకు, వచ్చిన వారికి అల్పాహారం, విందులు ఏర్పాటు చేసే బాధ్యతను పౌరసరఫరాల శాఖకు, రక్షణ చర్యలు పోలీసు వర్గాలకు అప్పగిస్తున్నారు. ఇక జనాల్ని తరలించడం, కార్యక్రమం సజావుగా నిర్వహించే బాధ్యత రెవెన్యూ అధికారులదే. కేవలం ఒకపూటో, ఒక రోజు జరిగే ఈ కార్యక్రమాలకు రూ.కోట్లలో నిధులు మంచినీరులాగా అధికారులు ఖర్చు చేస్తున్నారు. కనీసం మూడు నాలుగు రోజులు ముందు నుంచి తాము చేసే పనుల్ని వదిలివేసి ఈ సభ కోసం కసరత్తు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
 
ఎప్పుడు వెళ్లిపోదామా అని....
అధికారుల ఒత్తిడి మేరకు తరలి వచ్చిన సభికులు ఎంత త్వరగా వెళ్లిపోదామా అని ఎదురు చూస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటం, వేడి, ఉక్కపోతకు తట్టుకోలేక సభాస్థలి నుంచి త్వరగా నిష్క్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. సోమవారం దీక్ష ప్రదేశంలో వెళ్లిపోతున్న మహిళలు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. తాము దూరప్రాంతాల నుంచి వచ్చామని కనీసం 7 గంటలకు వెళ్లితేనే కనీసం 10 గంటలకు ఇంటికి చేరుతామంటూ కొంతమంది మహిళలు  ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
బందరురోడ్లో  నరకమే!
ధర్మపోరాటదీక్ష, ఆడపిల్లలకు రక్షణగా కదులుదాం కార్యక్రమాలు ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించారు. ఇక జూన్‌2న జరిగే నవనిర్మాణదీక్ష బెంజి సర్కిల్‌లో నిర్వహిస్తారు. నగరంలో ఎంతో కీలకమైన బందరురోడ్డులో ఈ కార్యక్రమాలు నిర్వహించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.  సోమవారం సాయంత్రం కార్యాలయాలు వదిలే సమయానికి బందరు రోడ్డులో ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాలీ నిర్వహించడంతో నగర వాసులు సుమారు రెండుగంటల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు కూడా ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు భారీగా మోహరించాల్సి వచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement