బయటకు ఈడ్చుకొచ్చి.. చెప్పుతో కొట్టి..

women employees attacked on village secretary

సాక్షి, ప్యాపిలి: తోటి ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడుతున్నాడంటూ గ్రామ కార్యదర్శిని గ్రామస్తులు చితకబాదారు. కర్నూలు జిల్లా ప్యాపిలి గ్రామ పంచాయతీ కార్యదర్శి జనార్దన్, గత కొంత కాలంగా కలచట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శిని వేధింపులకు గురి చేస్తున్నాడు. బుధవారం బాధిత ఉద్యోగినితో పాటు దాదాపు 20 మంది గ్రామస్తులు ఒక్కసారిగా ప్యాపిలి గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి చొరబడి జనార్దన్‌ను ఈడ్చుకొచ్చారు. తోటి ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి సిగ్గు లేదా అంటూ పలువురు మహిళలు జనార్దన్‌పై చెప్పులతో దాడి చేశారు.

అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు..జనార్దన్‌ను స్టేషన్‌కు తరలించారు. అయినప్పటికీ ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు చేరేవరకు దారి పొడవునా అతనిపై దాడి చేసేందుకు యత్నించారు. జనార్దన్‌ తనకు రెండు నెలలుగా సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇలా మెసేజ్‌లు పెట్టవద్దని మర్యాద పూర్వకంగా చెప్పినా అతనిలో మార్పు రాలేదని వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా.. తనపై దాడి చేసిన వారిమీద జనార్దన్‌ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top