భర్త మరణాన్ని జీర్ణించుకోలేక.. రెండు నెలలుగా దిగులు పడుతూ తనువు చాలించింది ఓ మహిళ. ఈ ఘటన బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.
బుక్కరాయసముద్రం, న్యూస్‌లైన్ : భర్త మరణాన్ని జీర్ణించుకోలేక.. రెండు నెలలుగా దిగులు పడుతూ తనువు చాలించింది ఓ మహిళ. ఈ ఘటన బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. స్థానికంగా నివాసముంటున్న మల్లికార్జున (38), నాగవేణి(34) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతుండేవారు.
రెండు నెలల క్రిందట మల్లికార్జున గుండెపోటుతో మరణించాడు. అప్పటి నుంచి దిగులు పడుతున్న నాగవేణికి శుక్రవారం గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే మృతి చెందింది. దీంతో వీరి పిల్లలు హిమజ (తొమ్మిదవ తరగతి), సాయికృష్ణ (ఎనిమిదవ తరగతి) అనాథలుగా మిగిలారు. గుండె దిటవు చేసుకుని బతకకుండా నాగవేణి.. పిల్లలను అనాథలుగా చేసి పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సహాయం అందించి వీరిని ఆదుకోవాలని కోరుతున్నారు.