జంతువులకు సౌకర్యాలు కల్పించాలి

Wild Life Principal Nalini Mohan Visit Tirupati SV Zoo - Sakshi

వైల్డ్‌లైఫ్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ నళినీమోహన్‌ ఆదేశం

ఎస్వీ జూపార్కులో ఆకస్మిక  తనిఖీలు

చిత్తూరు, తిరుపతి అర్బన్‌: జంతువులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, అవి బక్కచిక్కితే ఊరుకునేది లేదని వైల్డ్‌లైఫ్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌(పీసీసీఎఫ్‌), అండ్‌ వార్డెన్‌ డి.నళినిమోహన్‌ హెచ్చరించారు. మంగళవారం ఆయన తిరుపతి ఎస్వీ జూపార్కును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడున్న జంతువులు, పక్షులు, వృక్షాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సింహాలు, పులుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న నిర్మాణాలను పరిశీలించారు. పనులను వేగవంతం చేయడమేగాక అందులో అన్ని వసతులు కల్పించాలని సూచించారు. మెను ప్రకారం జంతువులు, పక్షులకు ఆహారం అందజేయాలని ఆదేశించారు. వాటి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉందన్నారు.

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. తిరుపతి జూపార్కు ప్రధానమైందని, వేసవి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి సహకారం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సందర్శకుల సంఖ్య పెంచాల్సి ఉందన్నారు. నూతన ఆంగ్ల సంవత్సరాది రోజున బైక్‌లకు అనుమతివ్వడంతో సందర్శకుల సంఖ్య పెరిగిన విషయాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ శరవనన్, ఏసీఎఫ్‌ ధనరాజ్, డీఎఫ్‌ఓ శైలజ, జూపార్కు క్యూరేటర్‌ బబిత పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top