‘ఫాతిమా’ విద్యార్థుల సం‘గతి’ ఏంటి? | Sakshi
Sakshi News home page

‘ఫాతిమా’ విద్యార్థుల సం‘గతి’ ఏంటి?

Published Mon, Jul 2 2018 5:10 AM

What about Fatima Medical College Students - Sakshi

సాక్షి, అమరావతి: ఫాతిమా మెడికల్‌ కాలేజీ బాధిత విద్యార్థుల కథ మళ్లీ మొదటికొచ్చింది. ప్రభుత్వమే వారిని చదివిస్తుందని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత మళ్లీ పట్టించుకోలేదు. మెడికల్‌ సీట్లకు సంబంధించిన మొదటి దశ కౌన్సెలింగ్‌ పూర్తయినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీపై అధికారులను ప్రశ్నించినా భరోసా లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన రూ.37 కోట్లు ఇప్పటికీ ఆ కాలేజీ యాజమాన్యం వద్దే ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్‌ వర్సిటీ వీసీని సంప్రదించగా.. సీఎం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారని వాపోయారు. ప్రస్తుతం 62 మంది విద్యార్థులం అర్హత సాధించామని.. మమ్మల్ని చదివిస్తామంటూ ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. 

ముఖ్యమంత్రి ఏ రోజు ఏమన్నారంటే..
2016 డిసెంబర్‌ 22: వంద మంది ఫాతిమా విద్యార్థులను ప్రైవేటు కాలేజీల్లోని 50 సీట్లలో, ప్రభుత్వ కాలేజీల్లోని 50 సీట్లలో సర్దుబాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 
2017 జూలై: బాధిత విద్యార్థుల గురించి కేంద్రంతో మాట్లాడానని నంద్యాల ఉప ఎన్నికప్పుడు సీఎం చెప్పారు. వాళ్లందరూ తిరిగి ఎంబీబీఎస్‌ కొనసాగించేలా చేస్తామన్నారు. 
2017 ఆగస్ట్‌: ఇక మీ కష్టాలన్నీ తీరిపోయాయని విద్యార్థులకు సీఎం చెప్పారు.
2017 నవంబర్‌ 28: కోచింగ్‌ ఇప్పించి.. సీట్లు వస్తే వాటికయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
2018 జూన్‌ 6: కడపలో సీఎం మాట్లాడుతూ.. నీట్‌లో క్వాలిఫై అయిన ఫాతిమా విద్యార్థులందరికీ సీట్లు ఇప్పిస్తామని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement