తెగిస్తున్నారు.. | wealth of the big international value | Sakshi
Sakshi News home page

తెగిస్తున్నారు..

Aug 3 2014 3:35 AM | Updated on Sep 2 2017 11:17 AM

అంతర్జాతీయంగా విలువ కలిగిన ఎర్రచందనంను దోచుకెళ్లాలనే బడా స్మగ్లర్లు ఆశచూపుతున్న కాసుల కోసం తమిళనాడుకు చెందిన కూలీలు ఎంతకైనా తెగిస్తున్నారు.

రాజంపేట: అంతర్జాతీయంగా విలువ కలిగిన ఎర్రచందనంను దోచుకెళ్లాలనే బడా స్మగ్లర్లు ఆశచూపుతున్న కాసుల కోసం తమిళనాడుకు చెందిన కూలీలు ఎంతకైనా తెగిస్తున్నారు. తిరుపతి, రాజంపేట అటవీ డివిజన్‌లో విస్తరించిన శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనంను అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఎర్రచందనం చెట్లను నరికి తరలించుకుపోయేందుకు ఎర్రకూలీలు గుంపులు.. గుంపులుగా తరలివస్తున్నారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులపై ఎర్రకూలీలు దాడులు చేయడంతో ఇద్దరు అటవీ  సిబ్బంది ఇటీవల చనిపోయారు.
 
 దీంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై అటవీశాఖతో పాటు  పోలీసులు సమన్వయంగా పనిచేస్తూ వస్తున్నారు. కూంబింగ్‌తో పాటు స్మగ్లర్లను పట్టుకోవడం వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తూ వస్తున్నారు. అయితే చెట్లు కొట్టేందుకు తమిళనాడు నుంచి కూలీలు రావడం ఆగిపోవడంలేదు.  నెలరోజుల వ్యవధిలోనే బాలు పల్లె రేంజ్ పరిధిలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఎర్రకూలీలు మృతి చెందారు.
 
 జల్లెడ పడుతున్నా...
 శేషాచలం అడవులను స్పెషల్‌పార్టీతో పాటు అటవీ పోలీసులు జల్లెడ పడుతున్నప్పటికీ ఎర్రకూలీలు అడవిలోకి వచ్చేందుకు వెనకాడటం లేదంటే స్మగ్లింగ్  ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు నుంచి రైలుమార్గంలో  శేషాచ లం అడవులకు దగర్గగా ఉన్న బాలుపల్లె, మామండూరు, శెట్టిగుంట రైల్వేస్టేషన్లలో దిగేసి దర్జాగా అడవిలోకి వెళుతున్నారు. స్పెషల్ పార్టీతో పాటు అటవీ పోలీసుల వ్యూహాలను పసిగట్టి మరీ అడవిలోకి ప్రవేశిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలోకి చేరిన తర్వాత రెండు నుంచి మూడురోజులు దాకా మకాం వేసి చెట్లను కొట్టివేస్తున్నారు. కూంబింగ్ చేసే పోలీసులు ఎదురుపడితే తప్పించుకుపోవడం.. ఎదురుదాడులకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.
 
 తాజాగా వందమంది కూలీలు చొరబాటు
 జిల్లా సరిహద్దులోని కుక్కలదొడ్డి దాటిన తర్వాత  వందమంది కూలీలు శనివారం కూంబింగ్ చేస్తున్న స్పెషల్‌పార్టీ పోలీసులకు ఎదురుపడ్డారు. దీంతో ఒక్కసారిగా పోలీసులపైకి రాళ్ల దాడి చేశారు. కూంబింగ్ పార్టీలో కేవలం ఐదుమంది పోలీసులే ఉండటంతో ఏమీ చేయలేక వెనుదిరిగారు. పోలీసు బలగాలతో తిరిగి వెళ్లేసరికి  అప్పటికే ఎర్రకూలీలు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని రైల్వేకోడూరు డీఆర్వో మద్దిలేటి ధ్రువీకరించారు. కాగా వందమంది ఎర్రకూలీలు అడవిలోకి ప్రవేశించడంతో కూంబింగ్‌ను ముమ్మరం  చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement