
'హైదరాబాద్ పై చాలా అనుమానాలున్నాయి'
హైదరాబాద్ నగరంపై ప్రజలకు చాలా అనుమానాలున్నాయని మంత్రి దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంపై ప్రజలకు చాలా అనుమానాలున్నాయని మంత్రి దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. ఇక్కడి సీమాంధ్రులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఈ అంశానికి సంబంధించి ఆంటోనీ కమిటీని ప్రత్యేకంగా కలవాలనుకుంటున్నామని తెలిపారు. ఆంటోని కమిటీతో భేటీ అయ్యేందుకు ఈ నెల 19 వతేదీ కాకుండా మరో తేదీని కేటాయించాలని పీసీసీ చీఫ్ బొత్స ను కోరతామన్నారు.
కాగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో తెలంగాణ ప్రజా ప్రతినిధులు శుక్రవారం భేటీ అయ్యారు. బొత్సతో సమావేశం ముగిసిన అనంతరం మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ కుమార్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన తెలంగాణ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో విస్తృతసాయి సమావేశాన్ని నిర్వహిస్తామని, 19 వ తేదీన తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఆంటోని కమిటీతో సమావేశమవుతారన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని యథావిధిగా అమలు చేయాలని కమిటీకి నివేదిస్తామన్నారు. సీడబ్యూసీ తీర్మానం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేసే అవకాశం ఉండదని వారు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.