ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. మేం రెడీ | We are ready for elections : Navin Chand | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. మేం రెడీ

Jan 10 2014 11:54 PM | Updated on Aug 11 2018 8:48 PM

సాధారణ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బందోబస్తుకు తాము సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ రేంజ్ డీఐజీ నవీన్ చంద్ పేర్కొన్నారు.

  • నేరాలు పెరుగుతున్నాయ్
  •      ఎన్నికల నాటికి అధికారుల బదిలీలు
  •      సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎఫ్‌ఐఆర్ ప్రతి అందజేత
  •      హైదరాబాద్ రేంజ్ డీఐజీ నవీన్‌చంద్
  •   తాండూరు, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బందోబస్తుకు తాము సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ రేంజ్ డీఐజీ నవీన్ చంద్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తాండూరు అర్బన్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఐజీ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతానికి జిల్లాలో సరిపడ సిబ్బంది ఉన్నారని, ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారంఅవసరం మేరకు అదనపు సిబ్బందిని సమకూర్చుకుంటామని చెప్పారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలీసు అధికారుల బదిలీలు ఉంటాయని ఆయన చెప్పారు. జిల్లాల్లో నేరాల సంఖ్య పెరుగుతోందని డీఐజీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదికి సుమారు 15-20 శాతం నేరాలు పెరుగుతున్నాయన్నారు.
     
     ప్రజలు చైతన్యవంతమయ్యారని, నేరం జరిగితే ఠాణాలో ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. జైలు నుంచి విడుదలైన ఖైదీలు తరచూ చోరీలకు పాల్పడుతుంటారని, ఇలాంటి సందర్భాల్లో ఆధారాలు అంత సులువుగా లభించవని ఆయన అన్నారు. గస్తీ నిర్వహించే కానిస్టేబుళ్లు విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా..? లేదా అనే విషయం ఫీడ్‌బ్యాక్ సేకరించాలని అధికారులకు సూచించారు. తాండూరు అర్బన్ సీఐ కార్యాలయ స్థాయిని డీ నుంచి సీ కి పెంచేందుకు ఆలోచిస్తామన్నారు. కానిస్టేబుళ్ల సంఖ్యతో పాటు తాండూరులో బీట్‌లను ఎక్కువ చేయాల్సి ఉందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వచ్చిన ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతామన్నారు.
     
     ఫిర్యాదుదారుడికి ఎఫ్‌ఐఆర్ ప్రతిని అందజేయనున్నట్లు డీఐజీ నవీన్‌చంద్ పేర్కొన్నారు. ఠాణాలో ఫిర్యాదులు స్వీకరించకపోతే ఎస్పీ, అడిషనల్ ఎస్పీ తదితర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చని ప్రజలకు సూచించారు. ఠాణాలో రిసెప్షన్ కౌంటర్లు, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగడం తదితర 19 అంశాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు డీఐజీ పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. డీఐజీతో పాటు ఎస్పీ రాజకుమారి, అడిషనల్ ఎస్పీ వెంకటస్వామి, తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, సీఐలు సుధీర్‌రెడ్డి, రవిలు, ఎస్‌ఐ ప్రణయ్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement