‘వృద్ధులు, పిల్లలు ఏమాత్రం బయటకు రావొద్దు’

Vizianagaram Collector Talks In Meeting Over Corona Virus Regulation  - Sakshi

సాక్షి, విజయనగరం : నిత్యావసరాల కొనుగోలు కోసం మినహా ప్రజలు ఇంటి నుండి బయటికి రావద్దని.. మరి ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఏమాత్రం బయటకు రాకూడదని జిల్లా కలెక్టర్‌ డా. ఎం. హరి జవహర్‌ ప్రజలను కోరారు.  కరోనా వైరస్‌ నియంత్రణపై జిల్లా కలెక్టర్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు. కాగా ఈ టాస్క ఫోర్స్‌ కమిటీతో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..   జిల్లాలో నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలు తెరిచే వుంటాయని చెప్పారు. కూరగాయలకు జిల్లా స్థాయిలో ధరలు నిర్ణయిస్తున్నామన్నారు. ఒకవేళ నిత్యావసర సరుకులు, కూరగాయలపై ఇష్టానుసారంగా ధరలు పెంచి విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.(కరోనా: ముంబై లోకల్‌ రైళ్లు బంద్‌)

 ఏపీ: కరోనా నియంత్రణకు మరిన్ని చర్యలు

ఇక విదేశాల కాగా విదేశాల నుండి వచ్చిన వారు,  క్వారంటైన్‌లో ఉన్నవారు బయట తిరిగితే  వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక గ్రామాల్లో వుండే విదేశీయుల బాధ్యతను తహశీల్దార్, పోలీస్ శాఖలు అప్పగించగా.. పట్టణాల్లో వుండే విదేశీయుల బాధ్యత మున్సిపల్, పోలీస్ శాఖలకు  అప్పగించామన్నారు.  కరోనా చికిత్సకు సంబంధించిన సమాచారం కోసం 08922-227950 ఫోన్ నెంబర్‌తో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో కరోనా చికిత్సకు సంబంధించిన సమాచారం లేదా ఫిర్యాదు ఇచ్చేందుకు ఆరోగ్య శాఖ కార్యాలయంలోని 08922-236947 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు  ఫోన్‌ చేసి తెలపాలని కోరారు.  కిరాణా దుకాణాలు, మందుల షాపులు, పెట్రోల్ బంకులు, ఎల్.పి.జి. ఏజెన్సీలు, పాల విక్రయ కేంద్రాలు మినహా ఇతర వ్యాపార సంస్థలేవి తెరవడానికి వీలు లేదన్నారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసినపుడు కుడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ఇంటి వద్ద కుడా ప్రతి రోజు వీలైనన్ని సార్లు సబ్బు లేదా హ్యాండ్ వాష్‌లతో చేతులు, చేతి వ్రేళ్ళను కనీసం 20 సెకన్ల పాటు కడుక్కోవాలిని సూచించారు. (క‌రోనా.. తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం)

ప్రస్తుతం కరోనా వ్యాధి వ్యాప్తిలో మనం రెండో దశలో ఉన్నామని, ఈ స్థాయిలోనే వ్యాధిని కట్టడి చెయేచ్చని తెలిపారు. ఇందుకు ప్రజల సహకారం కావాలన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం ద్వారానే ఇది సాధ్యమన్నారు. జిల్లా కేంద్రం, నియోజక వర్గ కేంద్రాల్లో కలసి మొత్తం 1100 ఐసోలేషన్ పడకలు సిద్ధం చేస్తున్నామని, కరోనా చికిత్స కోసం జిల్లా కేంద్రంలో 300 పడకలు, నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడక చొప్పున ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నియోజక వర్గఆసుపత్రుల్లో తగిన సౌకర్యాలు లేకపోతె ఏదైనా భవనం లేదా లాడ్జిని అద్దె ప్రాతిపదికన తీసుకొని అక్కడ వసతులు కల్పిస్తామని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరోనా ఫిర్యాదుల కోసం 6309898989 వాట్సప్ నెంబర్ కుడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక కరోనా లక్షణాలతో జిల్లాలో ఇప్పటికి ఒక్క పాజిటివ్ కేసు కుడా నమోదు కాలేదని ఆయన వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top