ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు మంగళవారం రాత్రి విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్లే ఒకొక్క ప్రయాణీకుడి నుంచి రూ.2500 వసూలు చేశారు.
సీమాంధ్ర ఉద్యమాన్ని సాకుగా చూపి ప్రయాణికుల నుంచి అధిక చార్జీలను వసూలు చేసే ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు తమ తీరు మార్చుకోవాలని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి బుధవారం విశాఖపట్నంలో హెచ్చరించారు. ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు మంగళవారం రాత్రి విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్లే ఒకొక్క ప్రయాణీకుడి నుంచి రూ.2500 వసూలు చేశారు. ఆ విషయం తెలుసుకున్న సమైక్యాంధ్ర ఆందోళనకారులు వోల్వో బస్సులను నిలిపివేసి టైర్లలో గాలి తీశారు. సాధారణంగా అయితే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు వోల్వో బస్సుల్లో చార్జీ సుమారు 800 మాత్రమే ఉంటుంది. సంక్రాంతి లాంటి పండుగల సమయాల్లో కూడా మహా అయితే 1500 రూపాయలు మాత్రమే తీసుకునేవారని, కానీ ఇప్పుడు రైళ్లలో రిజర్వేషన్లు దొరక్కపోవడం, ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో ఉండటంతో ఇంత దారుణంగా నిలువుదోపిడీ చేస్తున్నారని పున్నమరాజు సురేష్ కుమార్ అనే ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా దోపిడీకి అధికారులు, నాయకులు అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సీమాంధ్రలో సమైక్య ఉద్యమానికి ఆర్టీసీ సిబ్బంది మద్దతు తెలపడంతో ఆ సంస్థకు చెందిన బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దాంతో సీమాంధ్ర నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అయితే ప్రయాణీకుల అత్యవసర ప్రయాణాన్నీ అసరగా తీసుకుని ప్రైవేట్ ఆపరేటర్లు బస్సు చార్జీలను పెంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సబ్బం హరి ఆపరేటర్లను హెచ్చరించారు.