తీరానికి కొత్త హారం | Visakhapatnam Beach Area Is Developing As A Biodiversity | Sakshi
Sakshi News home page

May 13 2018 1:19 PM | Updated on May 13 2018 1:19 PM

Visakhapatnam Beach Area Is Developing As A Biodiversity - Sakshi

విశాఖ సుందరి మెడలో పచ్చల హారంలా భాసిల్లుతున్న సాగర తీరం కొత్త నగిషీలు అద్దుకోనుంది. ఇప్పటికే దేశ, విదేశాల టూరిస్టులను అమితంగా ఆకర్షిస్తున్న తీరంలో కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకు 30 కిలోమీటర్ల తీరం వెంబడి సుందరీకరణ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఇందుకు రూ.150 కోట్లు వెచ్చిస్తున్నారు. జీవ వైవిధ్యంతోపాటు పర్యాటకులకు ఆకట్టుకునే విధంగా పలు ప్రాజెక్టులకు అధికారులు రూపకల్పన చేశారు. 15 రోజుల్లో తుది మాస్టర్‌ ప్లాన్‌ ఖరారు చేస్తారు. అనంతరం దానిపై నెల రోజుల పాటు ప్రజాభిప్రాయానికి అవకాశం కల్పిస్తారు. ప్రజల నుంచి అందే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం కార్యాచరణ ప్రారంభిస్తారు.

విశాఖ సిటీ : విశాఖ నగరానికి మణిహారమైన సువిశాల సాగర తీరం సరికొత్తగా కనువిందు చేయనుంది. కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ దాదాపు 30 చదరపు కిలోమీటర్ల వరకూ బీచ్‌లో విభిన్నతలు సంతరించుకునేలా మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమైంది. జీవీఎంసీ, వుడా సహా పలువురు స్టేక్‌ హోల్డర్ల నేతృత్వంలో ఏపీడీఆర్‌పీలో భాగంగా రూ.150 కోట్లతో విశాఖ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. నాలుగు జోన్లుగా జరగనున్న అభివృద్ధికి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌పై ప్రజల అభిప్రాయాలు సైతం సేకరించిన తర్వాత ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ

విశాఖ నగరికి పర్యాటక మణిహారం సుందర సాగర తీరం. ఇప్పటికే అనేక సందర్శన స్థలాలు, అంతర్జాతీయ స్థాయి సబ్‌మెరైన్, యుద్ధ విమాన మ్యూజియాలతో భాసిల్లుతున్న బీచ్‌కు సరికొత్త అందాలు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఏపీ డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్టు(ఏపీడీపీఆర్‌)లో భాగంగా బీచ్‌ను అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ, వుడా సిద్ధమయ్యాయి. హుద్‌హుద్‌ సమయంలో విశాఖ సముద్ర తీరం అతలాకుతలమైంది. అప్పటి వరకూ చేసిన అభివృద్ధి పనులు చిన్నాభిన్నమైపోయాయి. ఈ నేపథ్యంలో బీచ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ఏపీడీఆర్‌పీ ఈ ప్రాజెక్టు అమలుకు సిద్ధమైంది. కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ మొత్తం 30 చదరపు కిలోమీటర్ల వరకూ రూ.150 కోట్ల నిధులతో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం డీపీఆర్‌లు తయారు చేసేందుకు టెండర్లు పిలవగా రెండు సంస్థలు ముందుకొచ్చాయి. గతంలో తీర ప్రాంత అభివృద్ధిలో అనుభవం ఉన్న ఐఎన్‌ఐ డిజైన్‌ స్టూడియో ప్రైవేట్‌ లిమిటెడ్‌కు పూర్తిస్థాయి సమగ్ర నివేదిక తయారు చేసే బాధ్యతని అక్టోబర్‌ 25న అప్పగించారు. 11.72 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నివేదికను ఐఎన్‌ఐ ప్రతినిధులు పూర్తి చేశారు. మరో 15 రోజుల్లో దీన్ని ఖరారు చేయనున్నారు. దీనికి సంబంధించిన స్టేక్‌ హోల్డర్ల నాలుగో సమావేశం ఇటీవలే జీవీఎంసీలో జరిగింది. 10 రోజుల్లో చివరి సమావేశం నిర్వహించి బృహత్‌ ప్రణాళికకు ఓకే చెప్పనున్నారు.

అన్ని వర్గాలనూ అలరించేలా..
ఈ ప్రాజెక్టులో భాగంగా సువిశాల తీర ప్రాంతాన్ని విభిన్న రకాలుగా అభివృద్ధి చేయనున్నారు. సహజసిద్ధంగానూ అదే సమయంలో నగర జీవనానికి దగ్గరగానూ ఉండేలా రూపుదిద్దుకోనుంది. ముఖ్యంగా జీవవైవిధ్యాన్ని పరిరక్షించేలా, అన్ని వర్గాల ప్రజలనూ అలరించేలా బీచ్‌ ఫ్రంట్‌ అభివృద్ధి చేయాలని ఏపీడీఆర్‌పీ నిర్ణయించింది. సహజ పర్యావరణానికి, సముద్ర జీవావరణానికి హాని జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. అదే సమయంలో సంప్రదాయ మత్స్యకారుల జీవనానికి వి«ఘాతం కలగకుండా చూడాలని నిర్ణయించారు. మొత్తం ప్రాజెక్టుని 2 విభాగాలుగా విభజించారు. మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమయ్యాక ప్రజలకు అందుబాటులో ఉంచి అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. అనంతరం 104 వారాల్లో కనస్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను పూర్తి చేయాలని జీవీఎంసీ, వుడా భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించాయి.

మాస్టర్‌ ప్లాన్‌ వివరాలివీ..

ఆర్‌కే బీచ్‌లో సౌకర్యాలు మరింత మెరుగు పడనున్నాయి. ప్రత్యేక వాకింగ్‌ ట్రాక్‌లతో పాటు మరిన్ని విభిన్నతలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

వుడా పార్క్‌కు బీచ్‌ను అనుసంధానం చేసేలా ఏర్పాట్లు.

బీచ్‌కు వచ్చే పర్యాటకులతో జాలరిపేట స్థానికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

కోస్టల్‌ బ్యాటరీ నుంచి రుషికొండ వరకూ సుమారు 10 కి.మీ మేర ప్రత్యేక వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌ల ఏర్పాటు.

లాసన్స్‌ బే పార్క్, లుంబినీ పార్క్, తెన్నేటి పార్కులతో వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌ల అనుసంధానం.

జోడుగుళ్లపాలెం బీచ్‌కు, కైలాసగిరి మార్గానికి అనుసంధానం చేస్తూ తెన్నేటిపార్కుని అభివృద్ధి చేయనున్నారు.

సాగర్‌నగర్‌ బీచ్‌ను అభివృద్ధి చేసి మెరైన్‌ లైఫ్‌ పార్క్, ఎండాడ బీచ్‌తో అనుసంధానించనున్నారు.

సమగ్ర సౌకర్యాలతో రుషికొండ, మంగమూరిపేట బీచ్‌లను అభివృద్ధి చేయనున్నారు.

ఎర్రమట్టి దిబ్బలకు పర్యాటక తాకిడి పెరిగేలా వాకింగ్‌ ట్రాక్‌ల అభివృద్ధి.

భీమిలి బీచ్‌ పునరుద్ధరించి మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.

నాలుగు జోన్లుగా అభివృద్ధి

బీచ్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ దాదాపు 30 చదరపు కిలోమీటర్ల  వరకూ జరగనుంది. ఈ ప్రాంతాన్ని నాలుగు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నాలుగు జోన్లలో ప్రస్తుతం ఏ విధమైన అభివృద్ధి జరుగుతోంది... ఆ ప్రాంతాల్లో ఎలాంటి పనులు చేపడితే బాగుంటుందనే అంశంపై సర్వే నిర్వహించి మాస్టర్‌ ప్లాన్‌ డిజైన్‌ చేశారు. ముఖ్యంగా స్థానికతకు ప్రాధాన్యమిస్తూ వృక్ష సంపద, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే మౌలిక  సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పార్కుల్లో కొత్తదనం నింపాలని భావిస్తున్నారు. స్థానిక అంశాలను క్రోడీకరించుకొని చేయబోయే అభివృద్ధి కోసం తీరప్రాంతాన్ని నాలుగు జోన్లుగా విభజించారు. కోస్టల్‌ బ్యాటరీ జంక్షన్‌ నుంచి కురుపాం సర్కిల్‌ వరకూ, కురుపాం సర్కిల్‌ నుంచి రుషికొండ వరకూ, రుషికొండ నుంచి భీమునిపట్నం మీదుగా కాపులుప్పాడ– రుషికొండ జంక్షన్‌ వరకూ, భీమునిపట్నం నుంచి కాపులుప్పాడ–రుషికొండ జంక్షన్‌–భీమిలి బీచ్‌ వరకూ జోన్ల వారీగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement