27 నుంచి డబుల్‌ డెక్కర్‌ రైలు ప్రారంభం

Vijayawada To Visakhapatnam Double Decker Rail Start 27th August   - Sakshi

విజయవాడ– విశాఖపట్నాల మధ్య పయనం

సాక్షి, అమరావతి : దాదాపు మూడున్నరేళ్ల క్రితం రైల్వే మంత్రి ఇచ్చిన హామీకి మోక్షం లభించనుంది. విజయవాడ– విశాఖపట్నం మధ్య డబుల్‌ డెక్కర్‌ ఏసీ రైలు ఎట్టకేలకు (నెంబరు 22701/702)తో పట్టాలెక్కనుంది. ఆధునిక సదుపాయాలున్న ఉత్కృష్ట్‌ డబుల్‌ డెక్కర్‌ ఎయిర్‌ కండిషన్డ్‌ యాత్రీ (ఉదయ్‌) ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈనెల 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రాజధాని అమరావతికి విశాఖ– విజయవాడల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు నగరాల మధ్య డబుల్‌ డెక్కర్‌ రైలును నడపాలన్న డిమాండ్‌ నాలుగేళ్ల క్రితం నుంచి ఉంది.

దీంతో 2016 రైల్వే బడ్జెట్‌లో అప్పటి రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు ఈ ఉదయ్‌ రైలును ప్రకటించారు. అయితే అప్పట్నుంచి జాప్యం జరుగుతూ వచ్చింది. పంజాబ్‌లోని జలంధర్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో ఈ ఉదయ్‌ రైలు బోగీలు తయారయ్యాయి. అక్కడ నుంచి గత నెల 15న రాయగడ మీదుగా విశాఖ తీసుకొచ్చారు. విశాఖలో ట్రయల్‌ రన్‌తో పాటు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించారు. అన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో ఈ ఉదయ్‌ రైలు పట్టాలెక్కించడానికి రైల్వే ఉన్నతాధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఈ నెల 26న విశాఖలో ఈ రైలును కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్‌ చెన్నబసప్ప లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తరువాత 27వ తేదీ నుంచి విజయవాడలో ప్రయాణికులను అనుమతిస్తారు. ఈ రైలుకు రిజర్వేషన్‌ సదుపాయం ఉంది. 

అతి తక్కువ సమయం..
విజయవాడ–విశాఖపట్నం మధ్య 350 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రెండు నగరాల మధ్య ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు 6 నుంచి 10 గంటల ప్రయాణ సమయం పడుతోంది. ఈ ఉదయ్‌ రైలు మాత్రం కేవలం 5.30 గంటల్లోనే గమ్యాన్ని చేరనుంది. విశాఖలో ఉదయం 5.45కి బయల్దేరి మధ్యాహ్నం 11.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అలాగే సాయంత్రం విజయవాడలో 5.30కు బయల్దేరి రాత్రి 10.55కి విశాఖ చేరుతుంది. గురు, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో ఈ రైలు నడుస్తుంది. 

ఆధునిక సదుపాయాలు..
ఈ ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు (ఎనిమిది) బోగీల్లో ఆధునిక సదుపాయాలున్నాయి. పుష్‌బ్యాక్‌ సీట్లు, లగేజి ర్యాక్‌లు, విశాలమైన అద్దాలు, ఆటోమేటిక్‌ వెండింగ్‌ మెషీన్లు, భోజనం/అల్పాహారం చేసేందుకు ప్రత్యేక డైనింగ్‌ హాలు, విశాలమైన అద్దాలు, బయోటాయిలెట్లు వంటివి ఉంటాయి. ఇలాంటి సదుపాయాలు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మాత్రమే ఉన్నాయి. సాధారణ రైళ్ల బోగీల్లో 72 బెర్తులుంటాయి. ఈ ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌లో మొత్తం 120 సీట్లు ఉంటాయి. పై డెక్‌లో 50, దిగువన 48, బోగీ చివరలో 22 సీట్లు అమర్చారు. 

ఆదరణపై అనుమానాలు..
ప్రస్తుతం తిరుపతి– విశాఖల మధ్య డబుల్‌ డెక్కర్‌ నడుస్తోంది. దీనికి  తిరుపతి– విజయవాడల మధ్య ప్రయాణికుల నుంచి ఆశించిన ఆదరణ లేదు. అయితే విజయవాడ–విశాఖ నుంచి ఒకింత డిమాండ్‌ ఉంది. అందువల్ల ఈ ఉదయ్‌ రైలుకూ ఆదరణ ఉంటుందని రైల్వే వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ఈ రెండు నగరాల మధ్య టికెట్టు ధర (చైర్‌కార్‌కు) ప్రస్తుత డబుల్‌ డెక్కర్‌ రైలుకు రూ.525 ఉంది. కొత్తగా ప్రారంమయ్యే ఉదయ్‌ రైలుకు కూడా దాదాపు ఇదే ధర ఉండనుంది. అయితే ఈ ధర ధనికులు, వ్యాపారులు, అధికారులకే తప్ప సామాన్య/మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండదన్న వాదన ఉంది. విజయవాడ– విశాఖల మధ్య ప్రస్తుతం నడుస్తున్న రత్నాచల్, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సెకండ్‌ సిటింగ్‌ టికెట్టు ధర రూ.155 ఉంది. దీంతో ఈ రైళ్లకు ఫుల్‌ డిమాండ్‌ ఉంటోంది. ఉదయం 5.45కి బయల్దేరి మధ్యాహ్నం విజయవాడ చేరుకుని పనులు పూర్తి చేసుకుని తిరిగి 5.30కి బయల్దేరి రాత్రికి విశాఖ చేరుకుంటున్నందున ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి రాజధానికి వచ్చే అధికారులు, వ్యాపారులకు ఎంతో అనువుగా ఉంటుందని, అందువల్ల ఆదరణకు ఢోకా ఉండదని రైల్వే వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top