సామాన్యులకు ధరాఘాతం

Vegetable prices rise in the market - Sakshi

రైతుబజార్లలోనే చుక్కలనంటుతున్న కూరగాయల ధరలు

సాక్షి, అమరావతి: కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్తున్న వినియోగదారులకు వాటి ధరలు చూసి గుండెల్లో దడ పుడుతోంది. భారీగా పెరిగిన ధరలతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే వణికిపోతున్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, దీనికి తోడు కూరగాయల ధరలపై నియంత్రణ కూడా లేకపోవడంతో వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి దాపురించింది. మరోవైపు ఏటా వేసవిలో కూరగాయల ధరలు పెరగడం పరిపాటేనంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అయితే, ఆ మేరకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. కూరగాయల రవాణా చార్జీలు, దళారుల కమీషన్లు కలిపి మార్కెట్లో అధిక ధరలకు కూరగాయలను విక్రయిస్తూ సామాన్యుల నడ్డి విరగ్గొడుతున్నారు.

రాయితీ ధరలకు అందించాల్సి ఉన్నా..
సాధారణంగా కూరగాయలు వంటి నిత్యావసరాల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం రైతుబజార్లలోప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రాయితీ ధరలకు అందించేలా ఏర్పాట్లు చేయాలి. అయితే, విజయవాడ హైస్కూలు రోడ్డులో ఉన్న రైతుబజార్‌లో పట్టికలో తక్కువ ధర చూపుతూ ఎక్కువ ధర వసూలు చేస్తుండటం గమనార్హం. రైతుబజార్లలో రైతులకు బదులుగా ఎక్కువ మంది వ్యాపారులే తిష్టవేసి ఉంటున్నారు. టమోట, పచ్చి మిర్చి తదితరాలను రైతుబజార్‌లో విక్రయించకుండా అక్కడే బయట రోడ్డు పక్కన అధిక ధరలకు విక్రయిస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. వినియోగదారులు ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే.. ‘అవసరమైతే తీసుకోండి.. లేకపోతే పోండి’ అంటూ అక్కడి వ్యాపారులు కసిరికొడుతున్నారు. టమోట, పచ్చి మిర్చి, చిక్కుడు, బీన్స్, క్యాప్సికం ఇలా ఒకటేమిటి దాదాపు అన్ని కూరగాయలు వినియోగదారులను హడలెత్తిస్తున్నాయి. 10 రోజుల కిందట విజయవాడ రైతుబజార్‌లో కిలో రూ.15 ఉన్న టమోట ప్రస్తుతం రూ.32కు, పచ్చి మిర్చి రూ.20 నుంచి రూ.40కు, క్యారెట్‌ రూ.12 నుంచి రూ.34కు పెరిగింది. ఇలా ఏ కూరగాయలు ముట్టుకున్నా రెట్టింపు ధర పలుకుతూ షాక్‌ కొడుతున్నాయి. 

అధికారుల వాదన ఇలా..
అధికారుల వాదన మరోలా ఉంది. స్థానికంగా కాకుండా సుదూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుండటం వల్లే ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. రైతుబజార్‌ ధరల కంటే కనీసంగా కిలోకు రూ.15 నుంచి రూ.20 ఎక్కువగా బయట మార్కెట్లో, చిల్లర దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ప్రధానంగా విజయవాడ వన్‌టౌన్‌ కూరగాయల మార్కెట్‌కు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు టన్నుల్లో కూరగాయలు తెస్తుంటారు. ఇక్కడ రైతుబజార్‌ లేదు. దీంతో బహిరంగ మార్కెట్లోని ధరలకు కొనుగోలు చేయాల్సి రావడంతో సామాన్యులు కూరగాయలు కొనలేక, పచ్చడి మెతుకులు తినలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నలుగురు ఉండే కుటుంబం నాలుగు రకాల కూరగాయలను కొనుగోలు చేయాలంటే వారానికి రూ.300పైనే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. 

దండుకుంటున్న దళారులు, వ్యాపారులు
దళారులు, వ్యాపారులు భారీగా దండుకుంటున్నా పండించిన రైతుకు మాత్రం కనీస ధర కూడా లభించడం లేదు. వేసవి నేపథ్యంలో భూగర్భ జలాలు ఎండిపోయినా ఎన్నో తిప్పలు పడి సాగు చేసిన రైతుకు రిక్తహస్తమే ఎదురవుతోంది. అయితే, సాగునీటి సమస్యతో చాలా మంది రైతులు కూరగాయలను సాగు చేయడం లేదని, దీంతో ఏటా వేసవిలో ధరలు పెరుగుతున్నాయని రైతుబజార్‌లోని కయదారులు అంటున్నారు. కూరగాయల ధరలు పెరగడంతో రోజూ కూలికి పోతేగాని పూట గడవనివారు 15 రోజులుగా మార్కెట్‌కు వెళ్లడమే మానేశారని నారాయణమ్మ అనే మహిళ వెల్లడించింది. రైతుబజార్లలో ఉన్న ధరల పట్టికల్లో చూపుతున్న ధరలకు, విక్రయిస్తున్న ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని పలువురు వినియోగదారులు పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top